కేరళలో జికా వైరస్‌తో సరిహద్దుల్లో నిఘా పెంచిన కర్ణాటక

ABN , First Publish Date - 2021-07-11T00:21:51+05:30 IST

పొరుగు రాష్ట్రమైన కేరళలో కొత్తగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటంతో కర్ణాటక ప్రభుత్వం..

కేరళలో జికా వైరస్‌తో సరిహద్దుల్లో నిఘా పెంచిన కర్ణాటక

బెంగళూరు: పొరుగు రాష్ట్రమైన కేరళలో కొత్తగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. జికా వైరస్‌ రాష్ట్రంలోకి విస్తరించకుండా శనివారంనాడు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. సరిహద్దు జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉడిపి, ఛామరాజనగర్‌‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సరిహద్దుల్లో నిఘాను పెంచుతున్నట్టు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లతో నిరంతర నిఘా, పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, అర్బన్ వార్డులలో పదిహేను రోజులకు ఒకసారి పరిస్థితులను సమీక్షించాలని అన్ని జిల్లాల అధికారులను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.


కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి కథనం ప్రకారం, తిరువనంతపురంలోని పరస్సాల నివాసి అయిన 24 ఏళ్ల గర్భిణి జికా వైరస్‌ బారిన పడినట్టు వైద్య పరీక్షల్లో బయటపడింది. గర్భిణీ స్త్రీలలో ఈ తరహా వైరస్ కనపించడం ఇదే మొదటిసారి. కాగా, తిరువనంతపురంలో 14 జికా వైరస్ కేసులు బయటపడినట్టు అధికారులు తెలిపారు. రుతుపవనాల సీజన్ కావడంతో ఎల్లో ఫీవర్ దోమల కారణంగా జికా వైరస్ ప్రమాదం ఉందని వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. డెంగ్యూ, చికెన్‌గునియా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Updated Date - 2021-07-11T00:21:51+05:30 IST