Homebuilt plane: ఇంట్లోనే సొంతంగా విమానాన్ని తయారుచేసిన ఎన్నారై..! భార్యాపిల్లలతో కలిసి అనేక దేశాల్లో పర్యటన..!

ABN , First Publish Date - 2022-07-27T02:21:50+05:30 IST

ఇంట్లోనే సొంతంగా విమానాన్ని నిర్మించిన ఓ ఎన్నారై ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్రిటన్‌లో సెటిలైన అశోక్ అళిసెరిల్ తమరక్షన్..తన ఇంటి గరేజ్‌లో ఓ తేలికపాటి విమాన్ని సిద్ధం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Homebuilt plane: ఇంట్లోనే సొంతంగా విమానాన్ని తయారుచేసిన ఎన్నారై..! భార్యాపిల్లలతో కలిసి అనేక దేశాల్లో పర్యటన..!

ఎన్నారై డెస్క్: ఇంట్లోనే సొంతంగా విమానాన్ని తయారుచేసిన ఓ ఎన్నారై ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్రిటన్‌లో సెటిలైన అశోక్ అళిసెరిల్ తమరక్షన్.. తన ఇంటి గరేజ్‌లో ఓ తేలికపాటి విమాన్ని సిద్ధం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు.. ఆ విమానంలో ఆయన తన భార్యాపిల్లలతో కలిసి ఐరోపాలోని అనేక దేశాలు చుట్టొచ్చారు కూడా..! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..? అసలు ఇంట్లో విమానాలు తయారుచేయడం సాధ్యమేనా అని అనుకుంటున్నారా..? అయితే.. ఈ ఆసక్తికర కథనం మీకోసమే.. 


కేరళ(Kerala) మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరక్షణ్ కుమారుడే అశోక్. పాలక్కాడ్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన అశోక్.. 2006లో పైచదువుల కోసం బ్రిటన్‌ వెళ్లారు. ఆ తరువాత లండన్‌లో(London) సెటిలయ్యారు. ఆయన భార్య పేరు అభిలాష. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు. ప్రస్తుతం అశోక్.. ఫోర్డ్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నారు.  కాగా.. తనకంటూ ఓ సొంత విమానం ఉండాలన్న ఆలోచన కరోనా లాక్‌డౌన్ సమయంలో వచ్చిందని అశోక్ చెప్పారు. ‘‘2018లో నాకు పైలట్ లైసెన్స్ వచ్చింది. ఆ తరువాత.. ఇద్దరు ప్రయాణించగలిగే తేలికపాటి టూ సీటర్ విమానాలను అద్దెకు తీసుకుని చిన్న చిన్న పర్యటనలు చేస్తుండేవాడిని. కానీ.. మా కుటుంబం మొత్తం ప్రయాణించేందుకు ఈ విమానాలు సరిపోవు. దీంతో.. నలుగురు ప్రయాణించగలిగిన ఫోర్ సీటర్ విమానాలు ఉంటే బాగుండని నాకు అనిపించింది. అయితే.. అటువంటి విమానాలు చాలా అరుదు. అందుబాటులో ఉన్నవి కూడా పాత మోడళ్లే. దీంతో.. నేను ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతుండగా హోంబిల్ట్ విమానాల గురించి తెలిసింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 


కొన్ని కంపెనీలు హోంబిల్ట్ విమానాలను(Home-built planes) విడి భాగాలుగా తయారుచేసి విక్రయిస్తుంటాయి. వాటిని ఇంటికి తెచ్చుకుని కంపెనీ సూచనల ప్రకారం ఒకదానికి మరొకటి జతచేసి విమానాన్ని తయారుచేయవచ్చు. వీటిని కిట్ ప్లేన్ అని కూడా అంటారు. ఇక.. స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ నుంచి అశోక్ ఓ కిట్‌ను కొనుగోలు చేశారు. ఇంట్లోనే విమానం విడిభాగాలను జతచేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కావాల్సిన పనిముట్లను సిద్ధం చేసుకున్నారు. దాదాపు రెండేళ్లు కష్టపడి విమానాన్ని తయారుచేశారు. బ్రిటన్‌లో ఇటువంటి విమానాలకు అనుమతి ఉండటంతో.. పౌర విమానయాన శాఖ అధికారులు అప్పుడప్పుడూ వచ్చి తనిఖీ చేసి వెళుతుండేవారు. ఫిబ్రవరిలోనే విమాన తయారీ పూర్తైంది. ఆ తరువాత కొంత కాలానికే ఆయన తన సొంత విమానంలో టూర్ వేశారు. విమాన తయారీకి మొత్తం 1.8 కోట్లు ఖర్చైందని ఆశోక్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో డబ్బు ఆదా చేసి ఈ విమానం కొన్నామని అశోక్ దంపతులు చెప్పారు. ఈ విమానం గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.


ఇప్పటికే అశోక్ తన కుటుంబంతో ఈ విమానంలో పలు దేశాలు చుట్టొచ్చారు. బ్రిటన్‌లోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు జర్మనీ, ఆస్ట్రియాకు కూడా వెళ్లొచ్చారు. ఇటువంటి విమానాలకు ఐరోపా, అమెరికా దేశాల్లో అనుమతి ఉందని అశోక్ చెప్పారు. భారత ప్రభుత్వం కూడా హోంబిల్ట్ విమానాలపై ఓ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అన్నట్టు.. తన విమానానికి అశోక్‌ తన చిన్నకూతురు దియా పేరిట జీ-దియా అని నామకరణం చేశారు. 

Updated Date - 2022-07-27T02:21:50+05:30 IST