భారత్‌ నుంచి సౌదీకి 280 రోజుల పాటు పాదయాత్ర.. 6 దేశాల మీదుగా ప్రయాణం.. 29 ఏళ్ల యువకుడి సాహసం ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-07-28T19:17:20+05:30 IST

ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కల కంటాడు. హజ్ అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా నగరానికి తీర్థయాత్ర చేయడం.

భారత్‌ నుంచి సౌదీకి 280 రోజుల పాటు పాదయాత్ర.. 6 దేశాల మీదుగా ప్రయాణం.. 29 ఏళ్ల యువకుడి సాహసం ఎందుకంటే..

ఎన్నారై డెస్క్: ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర (Haj Pilgrimage) చేయాలని కల కంటాడు. హజ్ అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా (Makkah) నగరానికి తీర్థయాత్ర చేయడం. ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన మక్కా మజీద్ సౌదీ అరేబియాలోని మక్కానగరంలో ఉంది. మహ్మద్ ప్రవక్త కాలం నాటి ఈ మక్కా పుణ్యక్షేత్రానికి సాగించే యాత్రనే హజ్ యాత్రగా పేర్కొంటారు. హజ్ యాత్రలో భాగంగా ముస్లిములందరూ మక్కాలోని 'కాబా'గృహం చేరి హజ్ సంప్రదాయాన్ని అనుసరించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. ఇలా ప్రతియేటా భారీ సంఖ్యలోనే ప్రపంచం నలుమూలల నుంచి ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇక విదేశాల నుంచి వచ్చేవాళ్లు దాదాపుగా విమాన జర్నీ చేస్తారు. అయితే, భారత్‌లోని కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన 29 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం కాలినడకన మక్కా వెళ్తున్నాడు. దీనికోసం అతడు 8,640 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. భారత్, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, కువైత్ మీదుగా సౌదీ అరేబియా (Saudi Arabia) చేరుకోవాలి. అసలు అతడు ఇంత పెద్ద సాహసయాత్ర చేపట్టడానికి కారణం ఏంటి? ఈ యాత్రను విజయవంతం చేయడానికి అతడి ప్రణాళిక ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


షిహాబ్ చొట్టూర్ (Shihab Chottur)ది కేరళలోని మలప్పురం జిల్లా కొట్టక్కల్ సమీపంలోని అతవనాడ్. అయితే, షిహాబ్ చిన్నప్పుడు పాత కాలంలో కేరళ నుండి పవిత్ర భూమి మక్కా వరకు కాలినడకన ప్రయాణించే వ్యక్తుల కథలను వింటూ పెరిగాడు. దాంతో చిన్నప్పుడే అతడు తాను కూడా మక్కాకు వెళ్తే నడిచే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అదే అతని జీవిత కలగా మారింది. తనతో పాటు తన కలను పెంచుకున్నాడు. పెరిగి పెద్దవాడైన షిహాబ్.. జీవితంలో బాగానే స్థిరపడ్డాడు. ప్రస్తుతం స్థానికంగా అతడికి సొంతంగా ఓ సూపర్ మార్కెట్ (Super Market) ఉంది. జీవితంలో ఏ లోటు లేదు. దాంతో తన చిన్ననాటి కల(మక్కాకు కాలినడకన వెళ్లడం)ను సాకారం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని ముందే పూర్తి చేసుకున్నాడు. అనంతరం గత నెల 2న మక్కాకు కాలినడకన హజ్ యాత్ర (Haj Pilgrimage) ప్రారంభించాడు. 


ఇక అతడు భారత్ నుంచి ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, కువైత్ ఐదు దేశాల మీదుగా ప్రయాణించి సౌదీ అరేబియా (Saudi Arabia) చేరుకోవాలి. తన గమ్యస్థానానికి చేరుకోవాలంటే అతడు మొత్తంగా 8,640 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా డైలీ కనీసం 25 కిలోమీటర్లు నడవాలనేది షిహాబ్ ప్లాన్. ఇలా చేస్తే సుమారు 280 రోజుల్లో అతడు మక్కా (Makkah) చేరుకోగలడు. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షిహాబ్ (Shihab Chottur) పవిత్ర నగరానికి చేరుకుంటాడన్నమాట. ప్రస్తుతం అతనితో పాటు మరో ఇద్దరు నడుస్తున్నారు. మరో ఆరుగురు సభ్యుల బృందం అతడ్ని అనుసరిస్తోంది. మార్గం మధ్యలో షిహాబ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా షిహాబ్ మాట్లాడుతూ.. “హజ్‌లో భాగంగా ఆచారాలను నిర్వహించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. అల్లాహ్ కోసం హృదయపూర్వకంగా హజ్ యాత్ర చేయడమనేది ఓ బిడ్డ తన తల్లి కడుపు నుంచి భూమిపైకి వచ్చిన తొలి రోజున ఎంత పవిత్రంగా ఉంటుందో అంతా పవిత్రం. మక్కా (Makkah) నుండి స్వచ్ఛమైన ఆత్మగా తిరిగి వస్తానని ఆశిస్తున్నాను." అని అన్నాడు. 



Updated Date - 2022-07-28T19:17:20+05:30 IST