లెస్బియన్ జంట అధీలా-ఫాతిమాను ఒక్కటి చేసిన కేరళ హైకోర్టు

ABN , First Publish Date - 2022-05-31T23:50:13+05:30 IST

లెస్బియన్ జంట అధీలా నస్రీన్-ఫాతిమా నూర్ కలిసి జీవించేందుకు కేరళ హైకోర్టు అనుమతినిచ్చింది. అధీలా

లెస్బియన్ జంట అధీలా-ఫాతిమాను ఒక్కటి చేసిన కేరళ హైకోర్టు

తిరువనంతపురం: లెస్బియన్ జంట అధీలా నస్రీన్-ఫాతిమా నూరా కలిసి జీవించేందుకు కేరళ హైకోర్టు అనుమతినిచ్చింది. అధీలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన అనంతరం వారిద్దరూ కలిసి జీవించొచ్చని తీర్పు చెప్పింది. ఫాతిమాను ఆమె తల్లిదండ్రులు అపహరించారని, కన్వర్షన్ థెరపీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ అధీలా గత వారం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.


అయితే, ఇది వారి వ్యక్తిగత వ్యవహారమంటూ కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో అధీలా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమకు కలిసి జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు. విచారించిన కోర్టు వారిద్దరూ కలిసి జీవించేందుకు అనుమతినిచ్చింది.


అలువాకు చెందిన 22 ఏళ్ల అధీలా, కోజికోడ్‌కు చెందిన 23 ఏళ్ల ఫాతిమా నూరా సౌదీ అరేబియాలో చదువుకుంటున్నప్పుడు ప్రేమలో పడ్డారు. అయితే, వీరి లెస్బియన్ సంబంధాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. కేరళ తిరిగి వచ్చాక కూడా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగింది. కలిసి జీవించాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వీరిద్దరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. LGBTIQ+, ఇతర అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్న కోజికోడ్‌లోని వనజా కలెక్టివ్ అనే ఎన్‌జీవోలో ఆశ్రయం పొందారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరూ కలిసి జీవించేందుకు మార్గం సుగమమైంది.

Updated Date - 2022-05-31T23:50:13+05:30 IST