మహిళకు మగ తోడుపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-04-11T01:43:16+05:30 IST

పురుషుని మద్దతు లేకపోతే తన జీవితానికి అర్థం లేదని మహిళ భావిస్తే, ఆ సమాజం

మహిళకు మగ తోడుపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

కొచ్చి : పురుషుని మద్దతు లేకపోతే తన జీవితానికి అర్థం లేదని మహిళ భావిస్తే, ఆ సమాజం విఫలమైనట్లేనని కేరళ హైకోర్టు పేర్కొంది. సహజీవనం చేసి, విడిపోయిన జంట తిరిగి కలుసుకుని, తమ బిడ్డ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒంటరి తల్లి ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ, మహిళలకు గౌరవం లభించే చోట దైవత్వం వృద్ధి చెందుతుందని, ఆడవారికి గౌరవం దక్కని చోట ఎన్ని మంచి పనులైనా నిష్ఫలమవుతాయని మనుస్మృతి చెప్తోందని తెలిపింది. 


సామాజిక కార్యకర్తలైన ఓ యువతి, ఓ యువకుడు 2018లో కేరళ వరదల సమయంలో కలుసుకున్నారు. అనంతరం ఇరువురూ సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో వీరు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. యువకుడు సినీ కళాకారుడు కావడంతో కర్ణాటకకు వెళ్ళాడు. కొంతకాలంపాటు ఆ యువతితో సంబంధాలను తెంచుకున్నాడు. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ జాడ తెలియకుండా పోయాడు. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆ యువతి తాను కన్న బిడ్డను 2020 మే 8న బాలల సంక్షేమ కమిటీకి అప్పగించింది. అనంతరం ఆ బిడ్డను చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉంచారు. తన బిడ్డ క్షేమాన్ని తెలుసుకునేందుకు ఆమె తరచూ ఈ కేంద్రానికి వెళ్తూ ఉండేవారు. చివరికి ఈ బిడ్డను 2021 ఫిబ్రవరి 2న వేరొక దంపతులకు దత్తత ఇచ్చారు. 


ఇటువంటి పరిస్థితుల్లో ఆ యువకుడు కర్ణాటక నుంచి తిరిగి వచ్చాడు. తాను సహజీవనం చేసిన యువతిని కలిశాడు. తిరిగి ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. తమ బిడ్డను తిరిగి పొందడం కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి, ఆ బిడ్డ సంరక్షణ బాధ్యతను స్వీకరించేందుకు ఇష్టపడుతున్నందువల్ల, కమిటీ ఆ దంపతుల వాదనను పరిశీలించాలని తెలిపింది. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించినట్లు చెప్పుకుంటున్న రాష్ట్రంలో మహిళల పట్ల మన వైఖరి తృణీకార భావంతో ఉందని పేర్కొంది. ఒంటరి తల్లికి ఆర్థిక, సాంఘిక మద్దతు దొరకడం లేదని పేర్కొంది. ఆమె మానసిక సవాళ్ళను ఎదుర్కొనవలసి వస్తోందని, తాను చేసిన తప్పు వల్ల ఒంటరితనమే గతి అని నమ్మక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొంది. వ్యవస్థ నుంచి ఆమెకు ఎటువంటి మద్దతు లభించడం లేదని తెలిపింది. ఇటువంటి ఒంటరి తల్లులకు మద్దతుగా నిలవడం కోసం ప్రభుత్వం ఓ పథకాన్ని ఆవిష్కరించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపింది. 


సమాజం సృష్టించిన నిబంధనలు ఒంటరి మహిళను ఇబ్బందులకు గురి చేశాయని తెలిపింది. ఆమె గర్భస్రావం చేయించుకోవాలని ఎన్నడూ కోరుకోలేదని, బిడ్డకు జన్మనివ్వడం కోసం ఆమె బాధలను అనుభవించిందని పేర్కొంది. అందరు తల్లుల మాదిరిగానే ఆమె కూడా తన బిడ్డను సాకాలని కోరుకుందని తెలిపింది. కానీ సమాజంలోని పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొంది. పురుషుడి సహకారం, మద్దతు లేకపోతే తాను బతకలేనని ఆమె భావించారని వివరించింది. పురుషుని మద్దతు, సహకారం లేకపోతే తన జీవితానికి అర్థం లేదని ఓ మహిళ భావించినట్లయితే, అది సమాజ వైఫల్యమని వివరించింది. సర్వస్వాన్ని వదులుకునే మనోవికారానికి ఆమె లొంగిపోకూడదని చెప్పింది. ఈ విశ్వంలో మానవుల శక్తి మాతృత్వపు శక్తేనని పేర్కొంది. తన మనుగడను అణగదొక్కుతున్న శక్తులతో తన పోరాటాన్ని చట్టం సహకారంతో సమర్థించవచ్చునని ఆమె తెలుసుకునేలా చేయవలసిన బాధ్యత రాజ్యానిదేనని (ప్రభుత్వానిదేనని) తెలిపింది. ఆ ఆత్మ విశ్వాసమే ఆమెకు గుర్తింపు కావాలని, ఆమె అయినందుకే గౌరవం దక్కాలని తెలిపింది. 


మహిళ గర్భం ఆమెకు అత్యంత విలువైన ఆస్తి అని తెలిపింది. మహిళ గర్భంపై ఇతరులెవరూ హక్కును కోరడం సాధ్యం కాదని తెలిపింది. కేవలం ఆమె సమ్మతితోనే ఆమె గర్భంపై హక్కును కోరవచ్చునని వివరించింది. సహజీవనంలో జంటకు ఉమ్మడి హక్కులు, బాధ్యతలు ఉంటాయని పేర్కొంది. ఇది కాంట్రాక్టు వంటిదని వివరించింది. సహజీవనంలో పుట్టిన సంతానంపై జన్మనిచ్చిన తల్లిదండ్రుల హక్కులు ఇరువురికీ ఉంటాయని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-04-11T01:43:16+05:30 IST