మైనారిటీలకు కోటాను ప్రశ్నించిన హిందూ సంస్థకు జరిమానా విధించిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-07-24T23:27:17+05:30 IST

కొన్ని వర్గాలవారు వెనుకబడిన తరగతులకు చెందినవారు

మైనారిటీలకు కోటాను ప్రశ్నించిన హిందూ సంస్థకు జరిమానా విధించిన హైకోర్టు

కొచ్చి : కొన్ని వర్గాలవారు వెనుకబడిన తరగతులకు చెందినవారు కాదని ప్రకటించాలని కోరిన హిందూ సంస్థకు కేరళ హైకోర్టు జరిమానా విధించింది. హిందూ సేవాకేంద్రం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ, రూ.25,000 జరిమానా విధించింది. ఈ సొమ్మును కేరళలోని అరుదైన వ్యాధులతో బాధపడుతున్న బాలలకు ఆర్థిక సాయం చేయడానికి ఉద్దేశించిన బ్యాంకు ఖాతాకు ఒక నెలలోగా జమ చేయాలని తెలిపింది. ఈ ఆదేశాలను పాటించకపోతే కేరళ రెవిన్యూ రికవరీ యాక్ట్, 1968 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 


హిందూ సేవాకేంద్రం కోశాధికారి శ్రీకుమార్ మన్‌కుఝి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ముస్లింలు, లాటిన్ కేథలిక్స్, క్రిస్టియన్ నాడార్లు, క్రైస్తవంలో చేరిన షెడ్యూల్డు కులాలవారిని వెనుకబడిన తరగతులకు చెందినవారుగా పరిగణించరాదని ఆదేశించాలని హైకోర్టును కోరారు. వీరిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం వీరికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తోందని తెలిపారు. వీరిలో అత్యధికులు సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడినవారు కాదని తెలిపారు. కేరళలో సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన హిందువులు బాధపడుతున్నారన్నారు. 


దీనిపై హైకోర్టు స్పందిస్తూ రాజ్యాంగం, చట్టం కొన్ని వర్గాలను మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతులుగా గుర్తించినట్లు తెలిపింది. దీని ప్రకారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయని పేర్కొంది. 


Updated Date - 2021-07-24T23:27:17+05:30 IST