అభ్యంతరకర పోస్టులకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాధ్యుడు కాదు : హైకోర్టు

ABN , First Publish Date - 2022-02-25T00:49:15+05:30 IST

వాట్సాప్ గ్రూపులోని సభ్యులు పెట్టే అభ్యంతరకరమైన పోస్టులకు

అభ్యంతరకర పోస్టులకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాధ్యుడు కాదు : హైకోర్టు

కొచ్చి : వాట్సాప్ గ్రూపులోని సభ్యులు పెట్టే అభ్యంతరకరమైన పోస్టులకు ఆ గ్రూప్ అడ్మిన్ బాధ్యతవహించనక్కర్లేదని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై కేరళ పోలీసులు నమోదు చేసిన ఆరోపణలను రద్దు చేసింది. జస్టిస్ కౌసర్ ఎడప్పగథ్ ధర్మాసనం ఫిబ్రవరి 23న ఈ తీర్పు చెప్పింది. లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం (పోక్సో), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం  క్రింద ఈ కేసును నమోదు చేశారు. 


కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన మాన్యువల్ (22) ఓ వాట్సాప్ గ్రూపును ప్రారంభించారు. ఆయన దీనికి అడ్మిన్‌గా వ్యవహరిస్తున్నారు. 2020 మార్చి 29న ఈ గ్రూపులోని ఓ మెంబర్ పోర్న్ వీడియోను పోస్ట్ చేశారు. బాలలు లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఈ వీడియోలో ఉంది. 2020 జూన్ 15న ఎర్నాకుళం సిటీ పోలీసులు ఆ మెంబర్‌పై కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000; పోక్సో చట్టంలోని సెక్షన్లు 13, 14, 15 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మాన్యువల్‌ను రెండో నిందితునిగా చేర్చారు. ఆయన ఈ గ్రూపును క్రియేట్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు తుది నివేదికను సమర్పించారు. దీనిపై ఎర్నాకుళంలోని అదనపు సెషన్స్ కోర్టు విచారణ జరుపుతోంది. అయితే మాన్యువల్ హైకోర్టును ఆశ్రయించారు. తాను కేవలం గ్రూపు అడ్మిన్‌ను మాత్రమేనని, తనను ఈ కేసులో నిందితునిగా చేర్చడం సరికాదని వాదించారు. హైకోర్టు ఆయనకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. 


Updated Date - 2022-02-25T00:49:15+05:30 IST