Kerala: రాజ కుటుంబాలకు ఏటా రూ.5.4 కోట్లు ఇస్తున్న సర్కారు

ABN , First Publish Date - 2021-10-09T19:12:32+05:30 IST

కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 37 రాజ కుటుంబాలకు కుటుంబ

Kerala: రాజ కుటుంబాలకు ఏటా రూ.5.4 కోట్లు ఇస్తున్న సర్కారు

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 37 రాజ కుటుంబాలకు కుటుంబ, రాజకీయ పింఛన్లు చెల్లిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5.40 కోట్లు చెల్లించింది.  ట్రావన్‌కోర్, కొచ్చి, కొజిక్కోడ్ జమోరిన్ రాజ కుటుంబాలు కూడా ఈ పింఛన్లను పొందుతున్నాయి. సంపన్నులు కూడా ఈ పింఛన్లను పొందుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.


కేరళ శాసన సభకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపిన సమాచారం ప్రకారం, 37 రాజ కుటుంబాల్లోని సభ్యులకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5.40 కోట్లు కుటుంబ, రాజకీయ పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2013 నుంచి కొజిక్కోడ్ జమోరిన్ రాజ కుటుంబానికి చెందిన 876 మంది రూ.19.51 కోట్లు పింఛను పొందారు. ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా బ్రిటిష్ ఇండియాలో భాగమైన మలబార్ ప్రిన్స్‌లీ స్టేట్స్‌కు చెందిన రాజ కుటుంబాల సభ్యులకు మలిఖన్ పింఛనును ఇస్తోంది. 


అగ్ర వర్ణాల్లో పేదలను గుర్తించేందుకు సామాజిక-ఆర్థిక అధ్యయనం జరుగుతున్నప్పటికీ, రాజ కుటుంబీకుల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసే వ్యవస్థ లేదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. వారు పింఛనుకు అర్హులా? కాదా? అని నిర్థరించే యంత్రాంగం లేదన్నారు. సంపన్నులైన రాజ కుటుంబీకులు కూడా ఈ పింఛన్లను పొందుతున్నారన్నారు. 


జమోరిన్ రాజ కుటుంబంలోని ఒక్కొక్క సభ్యునికి నెలకు రూ.2,500 చెల్లించేవారు. దీనిని 2017లో రూ.3,000కు పెంచారు. ఈ పెరుగుదలను ట్రావన్‌కోర్, కొచ్చి రాజ కుటుంబాలకు కూడా వర్తింపజేశారు. 


1969 ఆగస్టు 29న కేరళ రెవిన్యూ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, 1949 జూలై 1 నాటికి అర్హులైనవారికి ఈ పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఈ పింఛను సొమ్ము కొన్ని నిబంధనలకు లోబడి ఒక్కొక్క రాజ కుటుంబానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది.


Updated Date - 2021-10-09T19:12:32+05:30 IST