మనసులు గెలిచింది

ABN , First Publish Date - 2021-10-24T05:30:00+05:30 IST

పుట్టిన మూడు రోజులకే ఆమె బతుకు పోరాటం మొదలైంది. ఎముకల వ్యాధితో జీవితం చక్రాల కుర్చీకే పరిమితమైనా... డాక్టర్‌ కావాలన్న జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకుంది.

మనసులు గెలిచింది

పుట్టిన మూడు రోజులకే ఆమె బతుకు పోరాటం మొదలైంది. ఎముకల వ్యాధితో జీవితం చక్రాల కుర్చీకే పరిమితమైనా... డాక్టర్‌ కావాలన్న జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకుంది. కోరుకున్నవాడిని పెళ్లాడి... భర్త నుంచి తొలి కానుకగా వీల్‌చైర్‌ను అందుకున్న కేరళ వైద్యురాలు ఫాతిమా అస్లా విజయం వెనక విరామం లేని కృషి ఎంతో ఉంది.


డాక్టర్‌ ఫాతిమా అస్లా... ప్రస్తుతం కొట్టాయం ‘ఏఎన్‌ఎస్‌ఎస్‌ హోమియో మెడికల్‌ కాలేజీ’ హాస్పిటల్‌లో హౌస్‌ సర్జన్‌. కేరళలోని కొళిక్కోడ్‌ ఆమె స్వస్థలం. సాధారణ మధ్యతరగతి కుటుంబం. తమకు పండంటి బిడ్డ పుట్టిందని ఆనందపడేలోపే ఆమె తల్లితండ్రులకు తీరని వేదన మిగిలింది. ఫాతిమాకు ఆస్టియోజెనిసిస్‌ ఇంపర్‌ఫెక్టా (పెళుసు నరాల వ్యాధి) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. 


‘‘కళ్లు తెరవక ముందే నా భవిష్యత్తు చీకట్లు కమ్మేసింది. 65 శాతం శారీరక వైకల్యం. కానీ మా అమ్మా నాన్న ఆ బాధ తెలియకుండా నన్ను పెంచారు. ఆరు సర్జరీల తరువాత ఇప్పుడు వాకర్‌ సాయంతో నాలుగైదు అడుగులు వేయగలుగుతున్నానంతే! తరచూ ఆసుపత్రులు... శస్త్రచికిత్సలు... చిన్నప్పటి నుంచి వైద్యులను చూసి నేను కూడా డాక్టర్ని కావాలని కలలు కనేదాన్ని. దాన్ని అమ్మా నాన్న గ్రహించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా నన్ను చదివించారు. వాళ్ల ప్రోత్సాహం, నా పట్టుదలతో అనుకున్నది సాధించాను’’ అంటూ భావోద్వేగంగా చెబుతుంది ఫాతిమా. 


అపురూప కానుక... 

లాక్‌డౌన్‌ సమయంలో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. గత ఏడాది ఓ స్నేహితుడి ద్వారా ఫిరోజ్‌ నెదియత్‌ పరిచయమయ్యాడు. అతడు తిరువనంతపురం ఫైన్‌ఆర్ట్స్‌ కాలేజీలో ఎంఎఫ్‌ఏ విద్యార్థి. డిజిటల్‌ ఆర్టిస్ట్‌. సొంత ఊరు లక్షద్వీప్‌. ‘‘కొద్ది రోజుల్లోనే మా మనసులు కలిశాయి. నా చుట్టూ ఉన్నవారి కళ్లల్లో నాపై జాలి కనిపిస్తుంది. కానీ ఫిరోజ్‌ అలా కాదు. నన్ను నన్నుగా... ఓ మనిషిగా ప్రేమించాడు. సానుభూతితో కాదు. అది నాకు బాగా నచ్చింది. విషయం మా పెద్దలకు చెప్పాం. ఎవరూ అభ్యంతరం తెలుపలేదు. పెళ్లి జరిగిపోయింది. నిన్నటి వరకు నా జీవితం గురించి నాకు కొంత అభద్రతా భావం ఉండేది. ఫిరోజ్‌ రాకతో ఆ భయం పోయింది’’ అంటోంది ఫాతిమా. అన్నట్టు ఆమెకు అతడు ఇచ్చిన పెళ్లి కానుక ఏమిటో తెలుసా..! ఆటోమేటిక్‌ వీల్‌చైర్‌. ‘‘నా సహచరుడితో కలిసి ఆ చైర్‌లో దేశం చుట్టి రావాలన్నది నా కోరిక’’ అంటున్న ఫాతిమా తన జీవిత పోరాటానికి అక్షర రూపం ఇచ్చింది. ‘నిలవుపోలే చిరిక్కున్న పెన్‌కుట్టి’ పేరుతో ఓ పుస్తకం రాసింది. తనలా వైకల్యం ఉన్నవారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది.

Updated Date - 2021-10-24T05:30:00+05:30 IST