కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయి : కేరళ సీఎం

ABN , First Publish Date - 2021-01-21T01:08:31+05:30 IST

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థలు

కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయి : కేరళ సీఎం

తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. ఈ కేసులో తమకు అనుగుణంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా ఈ వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి  ఓ లేఖ రాశారని చెప్పారు. 


పినరయి విజయన్ శాసన సభలో బుధవారం ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కస్టమ్స్ అధికారుల సమక్షంలో అసిస్టెంట్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఎంఎస్ హరికృష్ణన్ ఈ నెల 5న హాజరయ్యారని చెప్పారు. ఈ కేసులో ఇరికిస్తామని తనను బెదిరించారని, ఓ నిర్దిష్ట రూపంలో స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశారని  హరికృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నెల 7న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  ఈ చేదు అనుభవం గురించి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారన్నారు. ఈ బాధ్యతారహితమైన వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. 


ప్రభుత్వ అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరించకూడదని, వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయరాదని అన్నారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన అధికారులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటువంటి అమర్యాదకరమైన, అపరిపక్వ ప్రవర్తనను తాము సహించలేమన్నారు. 


ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపణలను కస్టమ్స్ శాఖ తోసిపుచ్చింది. కస్టమ్స్ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తాము దర్యాప్తు నిర్వహించలేమని తెలిపారు. తమ దర్యాప్తు మొత్తం రికార్డయిందన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోవడమే లక్ష్యంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. 


Updated Date - 2021-01-21T01:08:31+05:30 IST