Gujarat సీఎం డ్యాష్ బోర్డ్ వ్యవస్థకు కేరళ చీఫ్ సెక్రటరీ ప్రశంస

ABN , First Publish Date - 2022-04-29T14:56:13+05:30 IST

గుజరాత్ ప్రభుత్వ ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను కేరళ చీఫ్ సెక్రటరీ ప్రశంసించిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది....

Gujarat సీఎం డ్యాష్ బోర్డ్ వ్యవస్థకు కేరళ చీఫ్ సెక్రటరీ ప్రశంస

తిరువనంతపురం : గుజరాత్ ప్రభుత్వ ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను కేరళ చీఫ్ సెక్రటరీ ప్రశంసించిన ఉదంతం తాజాగా చర్చనీయాంశంగా మారింది.సీఎం డ్యాష్‌బోర్డ్ మానిటరింగ్ సిస్టమ్ (ఫైల్) పనితీరును అర్థం చేసుకోవడానికి కేరళ చీఫ్ సెక్రటరీ వీపీ జాయ్ గుజరాత్ సీఎం నివాసాన్ని సందర్శించారు.గుజరాత్ సీఎం డ్యాష్ బోర్డ్ ప్రజాసేవల పంపిణీని సమర్ధంగా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీపీ జాయ్ ప్రశంసించారు. గుజరాత్ రాష్ట్రంలో 55వేల పాఠశాలల పనితీరును పర్యవేక్షించే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ విద్యాసమీక్ష కేంద్రాన్ని కూడా జాయ్ పరిశీలించారు.బీజేపీ పాలిత గుజరాత్‌ రాష్ట్రంలో కేరళ నుంచి అధికారిక ప్రతినిధి బృందం చేసిన పర్యటనపై కేరళలోని ప్రతిపక్ష కాంగ్రెస్, ముస్లిం లీగ్ నేతలు విమర్శించారు.


రియల్ టైమ్ డేటాను ప్రదర్శించే పెద్ద స్క్రీన్‌తో కూడిన సీఎం డ్యాష్‌బోర్డ్‌ను గాంధీనగర్‌లోని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారిక నివాసంలో ఏర్పాటు చేశారు.గుజరాత్ ప్రభుత్వ సుపరిపాలన విధానాల గురించి తెలుసుకోవడానికి కేరళ ప్రధాన కార్యదర్శి ఇక్కడికి వచ్చారని గుజరాత్ అధికారులు చెప్పారు.డ్యాష్‌బోర్డ్‌ను ఉపయోగించి ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా రాష్ట్ర రవాణా, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి వివిధ పథకాల అమలు, ప్రాథమిక సేవలను పర్యవేక్షించవచ్చు.అవసరమైనప్పుడు గ్రామ స్థాయి వరకు స్థానిక అధికారులకు కాల్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.


గత సంవత్సరం కరోనావైరస్ మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు సీఎంవో డ్యాష్‌బోర్డ్ ద్వారా హాస్పిటల్ బెడ్‌లు, ఆక్సిజన్, మందుల లభ్యతను పర్యవేక్షించిందని అధికారులు చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం సాఫ్ట్‌వేర్, సాంకేతికతను కేరళకు అందించడానికి అంగీకరించింది.సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం గుజరాత్‌లో అనుసరించిన నమూనాను కోరుకుంటుందా అని కేరళ కాంగ్రెస్ చీఫ్ కె సుధాకరన్ ప్రశ్నించారు.




Updated Date - 2022-04-29T14:56:13+05:30 IST