Sanjay Raut Complaint : కిటికీలు, వెంటిలేషన్‌ లేని గదిలో ఉంచారు

ABN , First Publish Date - 2022-08-05T22:09:15+05:30 IST

కిటికీలు, గాలివెలుతురు లేని గదిలో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉంచినట్టు...

Sanjay Raut Complaint : కిటికీలు, వెంటిలేషన్‌ లేని గదిలో ఉంచారు

న్యూఢిల్లీ: కిటికీలు (Windows), గాలివెలుతురు (Ventilation) లేని గదిలో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉంచినట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.జి.దేశ్‌పాండేకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఫిర్యాదు చేశారు. ఈడీ మీద ఎలాంటి ఫిర్యాదులైనా ఉన్నాయా అని న్యాయమూర్తి దేశ్‌పాండే ప్రశ్నించినప్పుడు రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈడీని కోర్టు వివరణ కోరింది. ఇందుకు ఈడీ తరఫున హాజరైన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ హితేన్ వెనెగోకర్ సమాధానమిస్తూ, రౌత్‌ను ఏసీ రూమ్‌లో ఉంచినందు వల్లే అందులో కిటికీలు లేవని చెప్పారు. దీనికి రౌత్ స్పందిస్తూ, ఏసీ సిస్టమ్ ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను దానిని వినియోగించుకోలేదన్నారు. దీంతో తగినంత గాలివెలుతురు ఉన్న గదిలో ఆయనను ఉంచేలా చూస్తామని కోర్టు హామీ ఇచ్చింది.


సబర్సన్ గొరేగావ్‌లోని పాత్రా ఛావల్ రీడవలప్‌మెంట్‌లో అవకతవకలు, రౌత్ భార్య, అసోసియేట్ల ప్రమేయం ఇందులో ఉందనే ఆరోపణల కింద సంజయ్ రౌత్‌ను ఈడీ ఇటీవల అరెస్టు చేసింది. ఈడీ కస్టడీ ఈనెల 4వ తేదీతో ముగియడంతో గురువారంనాడు ఆయనను కోర్టు ముందు ఈడీ హాజరు పరిచింది. దీంతో ఆగస్టు 8 వరకూ కస్టడీని కోర్టు పొడిగించింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సన్నిహితుడైన సంజయ్ రౌత్ ఆ పార్టీ ప్రధాన ప్రతినిధిగా ఉండటమే కాకుండా, పార్టీ పత్రిక 'సామ్నా' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్నారు.

Updated Date - 2022-08-05T22:09:15+05:30 IST