Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

స్వాతంత్య్ర పోరాటంలో ‘మిస్సుల’

twitter-iconwatsapp-iconfb-icon
స్వాతంత్య్ర పోరాటంలో మిస్సులమిస్సుల సూర్యనారాయణ మూర్తి

మహాత్మా గాంఽధీ పిలుపుతో ఉద్యమబాట

సమ్మెలో పాల్గొనడంతో అరెస్టుచేసిన బ్రిటీష్‌ పాలకులు

9 నెలలపాటు జైలు శిక్ష

జాతీయ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా చురుకైన పాత్ర

అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం

మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నిక

నిస్వార్థంగా ప్రజాసేవ

చివరి వరకు పూరింటిలోనే జీవనంఅచ్యుతాపురం, ఆగస్టు 10: ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. మహాత్మాగాంఽధీ పిలుపుతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో విశాఖ జిల్లాలో ముఖ్యభూమిక పోషించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సర్పంచ్‌గా, సహకార సంఘం అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రజలకు సేవలు అందించారు. కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవులు నిర్వహించారు. చివరి వరకు నిస్వార్థంగా జీవించారు. ఆయనే మిస్సుల సూర్యనారాయణమూర్తి. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఆయన సేవలను  గుర్తు చేసుకుందాం... 

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో 1910 ఫిబ్రవరి 4న జన్మించారు మిస్సుల సూర్యనారాయణమూర్తి. 1929 మే 29న సుభద్ర అన్నపూర్ణాదేవిని వివాహమాడారు. ఈయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వివాహం అనంతరం 1932లో విజయనగరం ఎంఆర్‌ కళాశాల నుంచి బీఎస్సీ (రసాయన శాస్త్రం) పూర్తిచేశారు. తరువాత తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీలో పనిచేశారు. ఆ సమయంలో షుగర్‌ టెక్నాలజీలో కార్బన్‌ క్రియాశీలకతపై పరిశోధనలు కూడా జరిపారు. 

స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర

మిస్సుల సూర్యనారాయణమూర్తి స్వాతంత్య్ర సాధన కోసం మహాత్మా గాంఽధీ పిలుపు మేరకు 1941 జనవరి 31న సమ్మెలో పాల్గొని అరెస్టయ్యారు. అదే ఏడాది ఫిబ్రవరి ఒకటిన వంద రూపాయల జరిమానాతోపాటు తొమ్మిది నెలలు జైలు శిక్ష విధించిన బ్రిటీష్‌ ప్రభుత్వం.. సూర్యనారాయణమూర్తిని బళ్లారి జైలుకు పంపింది. 1941 అక్టోబర్‌2న జైలు నుంచి విడుదలయ్యారు. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈయన ఉద్యమ స్పూర్తిని గుర్తించిన జాతీయ కాంగెస్‌ పార్టీ 1942లో విశాఖ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించింది. స్వాతంత్ర్యానంతరం 1946 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.  1938 నుంచి 1956 వరకు కొండకర్ల పంచాయతీ సర్పంచ్‌గా, 1945 నుంచి పీసీసీ సభ్యుడిగా కొనసాగారు. 1953 నుంచి 1957 వరకు విశాఖ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా చేశారు.

మూడుసార్లు లోక్‌సభకు ఎన్నిక

స్వాతంత్ర్యానంతరం పార్లమెంటుకు రెండోసారి 1957లో జరిగిన ఎన్నికల్లో మిస్సుల సూర్యనారాయణమూర్తి గొలుగొండ (ద్విసభ్య) నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 1962, 1967 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. మూడు పర్యాయాలు ఆయన జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేశారు. ఇంకా కొండకర్ల వీవర్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 

అంటరానితనంపై ఉద్యమం

మిస్సుల సూర్యనారాయణమూర్తి బ్రాహ్మణ కులంలో జన్మించినప్పటికీ అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దళితుల కోసం అభివృద్ధి సూత్రాలను ప్రతిపాదించారు. ఆయన జీవితాంతం ఖాదీ వస్త్రాలనే ధరించారు. వయసు మీద పడడంతో అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ 1972 ఆగస్టు 18న  కన్నుమూశారు.


ఎంపీ అయినా పూరింటిలోనే నివాసం

 మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిస్సుల సూర్యనారాయణమూర్తి చివరివరకు కొండకర్లలోని పూరింటిలోనే నివసించారు. పెద్దల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను ప్రజా సేవకోసం ఖర్చు చేశారు.  సూర్యనారాయణమూర్తికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలుకాగా, ప్రస్తుతం వీరిలో ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారు. ఉద్యోగ రీత్యా విశాఖలోని అక్కయ్యపాలెంలో స్థిరపడ్డారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.