గల్లీ వాసుల మనసులు గెలిచిన ఢిల్లీ లీడర్‌

ABN , First Publish Date - 2020-02-22T07:47:30+05:30 IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మూడోసారి విజయదుందుభి మోగించి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఏడు పార్లమెంటు సీట్లను ఏకపక్షంగా బీజేపీకిచ్చిన ఢిల్లీ ఓటర్లు ఇంతలోనే ఆప్‌కు మెజార్టీ కట్టబెట్టింది...

గల్లీ వాసుల మనసులు గెలిచిన ఢిల్లీ లీడర్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మూడోసారి విజయదుందుభి మోగించి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.  ఏడు పార్లమెంటు సీట్లను ఏకపక్షంగా బీజేపీకిచ్చిన ఢిల్లీ ఓటర్లు ఇంతలోనే ఆప్‌కు మెజార్టీ కట్టబెట్టింది ఎందుకనే ప్రశ్న సహజంగానే వచ్చింది. దీనిపై ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఈ విషయమై రాజధాని ప్రజలు ఒక సర్వేలో తమ అభిప్రాయాలను స్పష్టంగానే వెల్లడించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశ భద్రత, జాతీయస్థాయి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయి నాయకత్వానికి మోదీ సమర్థవంతమైన లీడర్‌ అని భావించాము. ఇప్పుడు ఢిల్లీ వరకు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో కేజ్రీవాల్‌ రియల్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నందున మరోసారి వీరినే గెలిపించాలని భావించామని తెలియజేశారు. బీజేపీకి రాజధాని ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం అయినందున బీజేపీయే ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని వేసిన రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల పండితులు, మీడియా అంచనాలు తలకిందులైనాయి. నగరంలోని మురికివాడలను, అభివృద్ధికి నోచుకోని శివారు ప్రాంతాలను, ఇరుకు గల్లీలను, చాలీ చాలని ఆదాయాలతో నెట్టుకొస్తున్న మధ్య తరగతి వర్గాలను ప్రత్యేకంగా గుర్తించి వారితో ఎప్పుడూ నిరంతర సంబంధ బాంధ్యవ్యాలు కొనసాగిస్తూ కొంతమేర స్థానిక ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని నిర్మూలించడం, నీరు, విద్యుత్తు వంటి అతి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడం ఢిల్లీ బస్సులనందు మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఆదేశాలు జారీ చేయడం వంటి కారణాలతో పైన పేర్కొన్న ప్రత్యేక వర్గాలు ఇతని వైపు మొగ్గుచూపాయి. తనను కలుసుకోవడానికి వచ్చే సందర్శకులకు ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్స్‌ లేకుండా ఎప్పుడూ అందుబాటులో వుండడం కూడా కేజ్రీవాల్‌కు చాలా క్రేజ్‌ను పెంచాయి. ఎన్నికల్లో గెలుపును కట్టబెట్టాయి.

తిప్పినేని రామదాసప్పనాయుడు

Updated Date - 2020-02-22T07:47:30+05:30 IST