కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-05-18T21:51:08+05:30 IST

సింగపూర్‌లో కనిపించిన కోవిడ్-19 కొత్త వేరియెంట్

కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక

న్యూఢిల్లీ : సింగపూర్‌లో కనిపించిన కోవిడ్-19 కొత్త వేరియెంట్ మన దేశంలో ఈ మహమ్మారి మూడో ప్రభంజనంగా మారవచ్చునని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కొత్త వేరియంట్ చిన్న పిల్లలకు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. తక్షణమే సింగపూర్ నుంచి వైమానిక సేవలను నిలిపేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరారు. బాలలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 


కేజ్రీవాల్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, సింగపూర్‌‌లో కనిపించిన కొత్త రకం కరోనా వల్ల బాలలకు చాలా తీవ్రమైన అపాయం జరుగుతుందని చెప్తున్నారని పేర్కొన్నారు. ఇది మన దేశంలో కోవిడ్-19 మహమ్మారి మూడో ప్రభంజనానికి దారి తీయవచ్చునని హెచ్చరించారు. తక్షణమే సింగపూర్ నుంచి విమాన సేవలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా బాలలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 


ఇదిలావుండగా, ఢిల్లీలో క్రమంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలలో అత్యధికంగా రోజుకు 28 వేలకుపైగా కేసులు నమోదయ్యేవి. మంగళవారం ఈ కేసుల సంఖ్య 5,000 కన్నా తక్కువకు తగ్గింది. 


సింగపూర్, తైవాన్ వంటి దక్షిణాసియా దేశాలు కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ రెండు దేశాలు ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. 


రెస్టారెంట్లలో కూర్చుని ఆహారాన్ని స్వీకరించడంపై సింగపూర్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయడానికే ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. ఏడాది క్రితం విధించిన లాక్‌డౌన్ వంటి ఆంక్షలను మళ్లీ విధించింది. 


Updated Date - 2021-05-18T21:51:08+05:30 IST