ఆక్సిజన్ అవసరాలను 4 రెట్లు పెంచి చెప్పిన కేజ్రీవాల్ ప్రభుత్వం : సుప్రీంకోర్టు ప్యానెల్

ABN , First Publish Date - 2021-06-25T18:33:14+05:30 IST

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్యానెల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆక్సిజన్ అవసరాలను 4 రెట్లు పెంచి చెప్పిన కేజ్రీవాల్ ప్రభుత్వం : సుప్రీంకోర్టు ప్యానెల్

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్యానెల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో ఆక్సిజన్ అవసరాన్ని నాలుగు రెట్లు పెంచి చెప్పిందని పేర్కొంది. అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను రూపొందించింది. ఈ కమిటీలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ హోం సెక్రటరీ భూపిందర్ భల్లా, మాక్స్ హెల్త్‌కేర్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుద్ధిరాజ, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుబోధ్ యాదవ్ ఉన్నారు. ఆక్సిజన్ ఆడిట్ కోసం ఈ ప్యానెల్‌ను సుప్రీంకోర్టు నియమించింది. 


ఏప్రిల్ 25-మే 10 మధ్య కాలంలో కోవిడ్ మహమ్మారి అత్యంత తీవ్ర స్థాయిలో ఉందని, ఆ సమయంలో ఢిల్లీ నగరంలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఈ మధ్యంతర నివేదిక పేర్కొంది. ఢిల్లీకి అవసరానికి మించి ఆక్సిజన్‌ను సరఫరా చేయడం వల్ల, కోవిడ్-19 కేసులు ఎక్కువగా ఉన్న 12 రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాపై ప్రభావం పడినట్లు పేర్కొంది. 


ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాస్తవ ఆక్సిజన్ వినియోగంలో తీవ్ర వైరుద్ధ్యం ఉందని తెలిపింది. బెడ్ కెపాసిటీ ఆధారంగా రూపొందించిన సూత్రం ప్రకారం లెక్కించినపుడు ఆక్సిజన్ వినియోగం కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా చెప్పిందని పేర్కొంది. 1,140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఖర్చయినట్లు తెలిపిందని, అయితే బెడ్ కెపాసిటీ ఆధారంగా లెక్కించినపుడు 289 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగమైనట్లు వెల్లడవుతోందని పేర్కొంది. 


ఢిల్లీలో ఆక్సిజన్ సగటు వినియోగం 284 నుంచి 372 మెట్రిక్ టన్నులని తెలిపింది. ఢిల్లీకి అతిగా ఆక్సిజన్‌ను సరఫరా చేయడం వల్ల ఆక్సిజన్ అవసరం ఉన్న ఇతర రాష్ట్రాలపై ప్రభావం పడినట్లు తెలిపింది. ఢిల్లీలోని నాలుగు ఆసుపత్రులు తమ వద్ద తక్కువ పడకలు ఉన్నప్పటికీ అధిక ఆక్సిజన్ వినియోగం జరిగినట్లు పేర్కొన్నాయని వివరించింది. 


ఢిల్లీలో మిగులు ఆక్సిజన్ ఉందని, దీనివల్ల ఇతర రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా ప్రభావితమైందని సబ్ గ్రూప్‌నకు పెట్రోలియం అండ్ ఆక్సిజన్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) తెలిపింది. ఈ విధంగా అతిగా ఆక్సిజన్‌ను ఢిల్లీకి సరఫరా చేయడాన్ని కొనసాగిస్తే, జాతీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు ఢిల్లీలో ఆక్సిజన్ వినియోగం 350 మెట్రిక్ టన్నులకు మించలేదని వెల్లడైనట్లు పెసో తెలిపింది. 


సుప్రీంకోర్టు మే 5న కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల్లో దేశ రాజధాని నగరం ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని తెలిపింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలు ఇచ్చింది. 


Updated Date - 2021-06-25T18:33:14+05:30 IST