రేషన్ మాఫియా గుప్పిట్లో ఢిల్లీ ప్రభుత్వం: కేజ్రీవాల్‌పై రవిశంకర్ విసుర్లు

ABN , First Publish Date - 2021-06-11T21:38:30+05:30 IST

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెబుతున్న 'ఇంటి ముందుకే రేషన్' అంశంపై మాటలు తూటలు..

రేషన్ మాఫియా గుప్పిట్లో ఢిల్లీ ప్రభుత్వం: కేజ్రీవాల్‌పై రవిశంకర్ విసుర్లు

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెబుతున్న 'ఇంటి ముందుకే రేషన్' అంశంపై మాటలు తూటలు పేలుతున్నాయి. కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారంనాడు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ ఇవ్వడంలో విఫలమైన కేజ్రీవాల్... రేషన్ హోమ్ డెలివరీ అంటూ చాలా చెబుతున్నారంటూ రవిశంకర్ మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం రేషన్ మాఫియా గుప్పిట్లో ఉందని ఆరోపించారు.


'ఒకే దేశం ఒకే రేషన్ కార్డు' పథకాన్ని 34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఆమోదిస్తే, కేవలం మూడే రాష్ట్రాలు ఢిల్లీ, పశ్చిమబెంగాల్, అసోం అమలు చేయడం లేదని, ఢిల్లీలో ఎందుకు ఈ పథకాన్ని అమలు చేయడం లేదో కేజ్రీవాల్ ముందుగా చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 'ఇంటికే నేరుగా రేషన్ సరఫరా' స్కీమ్‌ను నిలిపేసిందంటూ కేజ్రీవాల్ ఇటీవల విమర్శలు చేసిన నేపథ్యంలో రవిశంకర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఢిల్లీలో ఇంటి ముందుకే రేషన్ పథకం అమలుకు రెండ్రోజుల ముందే కేంద్రం అడ్డుకుందని, తమ ఆమోదం తీసుకోలేని చెబుతోందని, అయితే తాము ఐదుసార్లు ఆమోదం కోరామని కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ అప్రూవల్ అవసరం లేదని, మర్యాద కోసమే తాము ఆ పని చేశామని కేజ్రీవాల్ చెప్పారు. పిజ్జాలు, బర్గర్లు, స్మార్ట్‌ఫోను ఇంటికే సరఫరా చేస్తున్నప్పుడు రేషన్‌కు ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ఆపవద్దని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-06-11T21:38:30+05:30 IST