సోషల్ మీడియాలోనే కేజ్రీవాల్ ప్రభంజనం : అనురాగ్ ఠాకూర్

ABN , First Publish Date - 2022-04-03T17:05:38+05:30 IST

గుజరాత్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్

సోషల్ మీడియాలోనే కేజ్రీవాల్ ప్రభంజనం : అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ : గుజరాత్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ ప్రభంజనం అని చెప్తున్నదానిని సోషల్ మీడియాలో మాత్రమే సృష్టిస్తున్నారని, క్షేత్రస్థాయిలో అదేమీ లేదని చెప్పారు. ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన కేజ్రీవాల్ మాట్లాడుతూ, తమ పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. 


చండీగఢ్‌లో అనురాగ్ ఠాకూర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ మీడియాలో మాత్రమే ఓ వాతావరణాన్ని సృష్టిస్తారని, క్షేత్ర స్థాయిలో అటువంటిదేమీ లేదని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, కేజ్రీవాల్ ఎలా ఓటమిపాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కనీసం ఒక స్థానమైనా దక్కలేదన్నారు. కొన్నిసార్లు వారు మీడియా ద్వారా ఓ వాతావరణాన్ని సృష్టిస్తారని, అయితే క్షేత్రస్థాయిలో ఏమీ ఉండదని  చెప్పారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యధికులు అభిమానిస్తున్న నేత అని అనురాగ్ చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయన పేరు మీద ఏకపక్షంగా బీజేపీకి ఓట్లు పడతాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో మళ్లీ బీజేపీ అధికారం చేపడుతుందన్నారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఓటమి గురించి ప్రస్తావించినపుడు ఠాకూర్ మాట్లాడుతూ, 2027లో జరిగే శాసన సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందన్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో తాము ప్రచారం ప్రారంభించడం ఆలస్యమైందన్నారు. 


అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తిరంగా యాత్ర నిర్వహించారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో తమకు ఓ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. గుజరాత్ శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయి. 


Updated Date - 2022-04-03T17:05:38+05:30 IST