‘దైనిక్ భాస్కర్’పై ఐటీ దాడులను ఖండించిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-07-22T20:40:55+05:30 IST

దైనిక్ భాస్కర్’ మీడియా గ్రూప్‌పైనా, ఉత్తర ప్రదేశ్‌లోని

‘దైనిక్ భాస్కర్’పై ఐటీ దాడులను ఖండించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ‘దైనిక్ భాస్కర్’ మీడియా గ్రూప్‌పైనా, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ హిందీ న్యూస్ ఛానల్‌పైనా ఆదాయపు పన్ను శాఖ దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. మీడియాను బెదిరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పన్ను ఎగవేత ఆరోపణలతో వివిధ నగరాల్లో ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. 


కేజ్రీవాల్ గురువారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్‌‌లపై ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడులు మీడియాను బెదిరించే ప్రయత్నాలని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వదిలిపెట్టబోమనే సందేశాన్ని ఇవ్వాలని వారు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటువంటి ఆలోచనా ధోరణి చాలా ప్రమాదకరమని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళమెత్తాలన్నారు. ఈ దాడులను వెంటనే ఆపాలని, స్వేచ్ఛగా పని చేసుకోవడానికి మీడియాకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


అంతకుముందు ఆదాయపు పన్ను శాఖ అధికారులు మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లలోని దైనిక్ భాస్కర్ గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా హిందీ న్యూస్ ఛానల్ భారత్ సమాచార్‌‌ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. 


ఈ సోదాలను కేజ్రీవాల్ సహా ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఖండించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, ఈ దాడులు మీడియాను అణచివేసే ప్రయత్నాలేనని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఇచ్చిన ట్వీట్‌లో పాత్రికేయులు, మీడియా హౌస్‌లపై దాడి ప్రజాస్వామ్యం గొంతు నులమడానికి జరుగుతున్న మరొక కిరాతక ప్రయత్నమని ఆరోపించారు. 


Updated Date - 2021-07-22T20:40:55+05:30 IST