న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్న రైతులకు ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' కన్వీనర్ మద్దతు తెలిపారు. రైతుల డిమాండ్లు వినాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ''భగత్‌సింగ్ వర్దంతి రోజు భారత్ బంద్‌కు పిలుపునివ్వడం విచారకరం. ప్రభుత్వానికి నచ్చచెప్పేందుకు దాదాపు ఏడాదిగా రైతులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది స్వంతంత్ర్ర భారతదేశం. స్వతంత్ర భారతావనిలోనే రైతుల గోడు వినకుంటే ఇంకెవ్వరు వింటారు?'' అని కేజ్రీవాల్ సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
రైతు డిమాండ్లు సరైనవేనని, వారి డిమాండ్లను కేంద్రం వినిపించుకోవాలని అన్నారు. మొదట్నించీ తాము రైతుల వెంటే ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా రైతుల సమస్యలను కేంద్రం తెలుసుకోవాలని పేర్కొన్నారు. తద్వారా రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లి తమ పనులు తాము చేసుకోగలుగుతారని అన్నారు. వ్యవసాయ మంత్రితో చాలా చర్చలే జరిగాయని, రైతుల డిమాండ్లు వింటున్నామని వ్యవసాయ మంత్రి ఇప్పుడు ఒక్క మాట ప్రకటించాల్సి ఉంటుదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.