ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-28T21:05:08+05:30 IST

దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో వైరస్ మరింత విస్తరించకుండా...

ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో వైరస్ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్ 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పైనే ఉంటోందని, దీంతో లెవల్-1 (ఎల్లో అలర్ట్) క్రమానుగతి ప్రతిస్పందన కార్యాచరణ ప్రణాళికను అమలులోకి తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. అధికారులతో సమీక్ష అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్యను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గతంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా ప్రభుత్వం సన్నద్ధతతో ఉందని చెప్పారు. ఢిల్లీ ప్రజలు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తూ.చ. తప్పకుండా పాటించాలని సూచించారు.


ఢిల్లీలో కొత్త ఆంక్షలివే...

-ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫూ

-50 శాతం సామర్థ్యంతో ప్రైవేటు కార్యాలయాల్లో పని.

-ఆటోలు, టాక్సీల్లో ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.

-బార్లు, స్పాలు కేవలం 50 శాతం సామర్థ్యంతో పనిచేయాలి.

-రెస్టారెంట్లు సైతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి.

-వివాహాలు, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తారు.

-బేసి, సరి సంఖ్యల విధానంలో దుకాణాలు, మాల్స్‌ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంచాలి.

-ఢిల్లీ మెట్రోలో 50 శాతం సీటింగ్ కెపాసిటీని మాత్రమే అనుమతిస్తారు. నిలబడి ప్రయాణించడానికి అనుమతించరు.

-ప్రార్థనా స్థలాలు తెరిచే ఉంచుతారు. కానీ  భక్తులను లోపలకు అనుమతించరు.

Updated Date - 2021-12-28T21:05:08+05:30 IST