Presidential Polls : మమతకు షాక్ ఇచ్చిన కేజ్రీవాల్, కేసీఆర్

ABN , First Publish Date - 2022-06-15T20:51:55+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు

Presidential Polls : మమతకు షాక్ ఇచ్చిన కేజ్రీవాల్, కేసీఆర్

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నడుం బిగించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీకి టీఆర్ఎస్, ఆప్, బీజేడీ షాక్ ఇచ్చాయి. బుధవారం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మమత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాబోమని ఈ మూడు పార్టీలు ప్రకటించాయి. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు రావాలని ఆమె గత శనివారం 22 మంది ప్రతిపక్ష నేతలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. 


ఈ సమావేశంలో పాల్గొనలేమని శివసేన (Shiv Sena) గతంలోనే ప్రకటించింది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray) ఈ సమావేశం జరిగే సమయంలో అయోధ్యలో పర్యటించబోతున్నారని తెలిపింది. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మాత్రమే స్పందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చెప్పినట్లు తెలుస్తోంది. 


మరోవైపు కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమక్షంలో మూడు రోజుల నుంచి (సోమవారం, మంగళవారం, బుధవారం) హాజరవుతుండటం మరొక పెద్ద చిక్కు సమస్యగా మారింది. విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నిర్మించే చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఎంసీ (TMC) ప్రకటించినప్పటికీ, బీజేపీ (BJP)ని ఘాటుగా విమర్శించే ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని మమత (Mamata Banerjee) ఆహ్వానించలేదు. 


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)ని ఆహ్వానించినప్పటికీ, ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మమత బెనర్జీ నిర్వహిస్తున్న సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణా సీఎం కే చంద్రశేఖర రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వంటి పెద్ద నేతలు పాల్గొనడం లేదని, తాము ఐక్యతను కోరుకుంటున్నామని, రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని కోరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎన్నుకోవడం సాధ్యంకాదని, ఎందుకంటే, కాంగ్రెస్‌కు 50 శాతం ఓట్లు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ కలిసికట్టుగా పోరాడాలనే లక్ష్యంతో తాము ఈ సమావేశంలో పాల్గొంటున్నామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నామన్నారు. 


2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలనాటికి ప్రతిపక్షాల ఐక్యతను సాధించేందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో జరిగే కసరత్తు దోహదపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. 


శరద్ పవార్‌ను ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలపాలన్న మమత, వామపక్షాల ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం. 


Updated Date - 2022-06-15T20:51:55+05:30 IST