Kejriwal: ఉచితాలు వద్దంటూ రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ ఎలా చేశారు?

ABN , First Publish Date - 2022-08-09T00:22:38+05:30 IST

ఉచితాలు వద్దని చెబుతూ కార్పొరేట్ మిత్రులకు రూ.10 లక్షల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేశారని..

Kejriwal: ఉచితాలు వద్దంటూ రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ ఎలా చేశారు?

న్యూఢిల్లీ: ఉచితాలు (Freebies) వద్దని చెబుతూ కార్పొరేట్ మిత్రులకు రూ.10 లక్షల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నిలదీశారు. ఈ చర్యను ''దేశ ద్రోహం'' (Treason)గా ప్రకటించే చట్టం తేవాలని, ఇందులో ప్రమేయమున్న ప్రతి వారిని కటకాల వెనక్కి పంపించాలని అన్నారు. ఒకరు మిత్రులకు ఫేవర్ చేసే "దోస్త్‌వాద్'' అని, మరొకరు కుటుంబ పాలన సాగించే "పరివార్‌వాద్'' అని బీజేపీ, కాంగ్రెస్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా ఆయన విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ''భారత్‌వాద్'' (Indianness)ను  చాటిచెప్పే ప్రయత్నం చేస్తోందని అన్నారు.


''మంత్రులకు మాత్రమే ఉచిత విద్యుత్ ఎందుకు ఉండాలి? సామాన్య ప్రజానీకానికి ఎందుకు ఉండకూడదు? ఉచిత నీరు, ఉచిత విద్య అందిస్తే అందులో తప్పేముంది?'' అని కేంద్రాన్ని కేజ్రీవాల్ నిలదీశారు. సంక్షేమ సేవలు ఉచితంగా ప్రభుత్వాలు ఇస్తే వాటిని ''తాయిలాలు'' అనడం సరికాదని, దీనికి బదులుగా 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఉచిత సంక్షేమ సేవలను మరింత పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.


నాణ్యత కలిగిన విద్య (క్వాలిటీ ఎడ్యుకేషన్), ఆరోగ్య సేవలను కేంద్రం ఉచితంగా అందించాలని, ఇంటింటికి 300 యూనిట్ల లోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ''ఈ వ్యక్తులు వారి మిత్రులకు రూ.10 లక్షల కోట్ల మేరకు రుణాలు మాఫీ చేశారు. అలాంటి వ్యక్తులను ద్రోహులని పిలవాలి. వారిపై దర్యాప్తు జరిపించాలి'' అని కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. 

Updated Date - 2022-08-09T00:22:38+05:30 IST