ఇటీవల మహేశ్ బాబు (Mahaesh babu) ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata) చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది మల్లూ బ్యూటీ కీర్తి సురేశ్. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న మలయాళ చిత్రం ‘వాశి’ (Vaashi) (పట్టుదల). ఆసక్తికరమైన కథాకథనాలతో కోర్ట్ రూమ్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కీర్తి.. వకీల్ గా నటిస్తుండగా.. హీరోగా నటిస్తున్న టోవినో థామస్ సైతం వకీల్గా నటిస్తుండడం విశేషం. ఒక కేసు విషయంలో ప్రేమికులైన ఈ ఇద్దరూ కోర్ట్ రూమ్లో ప్రత్యర్ధులుగా మారతారు. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకి విష్ణు జి రాఘవ్ (Vishnu g raghav) దర్శకుడు. రేవతి కళామందిర్ బ్యానర్ పై కీర్తి సురేశ్ తండ్రి.. జి. సురేశ్ కుమార్ (G.Suresh kumar ) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే నెల 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతున్న నేపథ్యంలో ఈ ‘వాశి’ చిత్రం టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
కోర్ట్ రూమ్లో నల్లకోటు తొడిగి.. ఒక కేసు విషయంలో నువ్వా నేనా అన్న స్థాయిలో ఎల్బీ, మాధవి పాత్రధారులు టోవినో, కీర్తిసురేశ్ వాదించడం టీజర్లో కనిపిస్తుంది. ఇదే తరహాలో గతంలో తెలుగులో వచ్చిన ‘లాయర్ సుహాసిని (Lawyer Suhasini), రాధా గోపాళం (Radha Gopalam)’ లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అంతగా అలరించలేకపోయాయి. ఇప్పుడు ఇంచుమించు ఇదే కథాంశంతో మలయాళంలో ‘వాశి’ చిత్రం రానుండడం గమనార్హం. చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో మూడు నాలుగు చిత్రాలు చేసిన కీర్తి.. హీరోయిన్ గా నటించిన ఒకే ఒక చిత్రం ‘గీతాంజలి’. ఆ తర్వాత ఆమె కథానాయికగా నటించిన సినిమా ఇదే అవబోతోంది. మరి ఈ సినిమా కీర్తికి ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.