కీచక రాఘవ నేరాలు.. ఘోరాలు!

ABN , First Publish Date - 2022-01-11T09:17:55+05:30 IST

ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు! ఫైనాన్షియర్‌ ఆత్మహత్య కేసులో ఏ1గా ఉన్నాడు! అడవిలోకి జొరబడి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు...

కీచక రాఘవ నేరాలు.. ఘోరాలు!

  • 15 సంవత్సరాల్లోనే 13 కేసులు నమోదు
  • ఓ మహిళపై లైంగిక దాడిలో నిందితుడు
  • ఫైనాన్షియర్‌ ఆత్మహత్య కేసులో ఏ1
  • రిమాండ్‌ రిపోర్టులో నేర చరిత్ర సుస్పష్టం


పాల్వంచ రూరల్‌: ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు! ఫైనాన్షియర్‌ ఆత్మహత్య కేసులో ఏ1గా ఉన్నాడు! అడవిలోకి జొరబడి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు! కీచక రాఘవకు సంబంధించి వెలుగులోకి వస్తున్న మరిన్ని కేసులివి! తాజాగా, మరింత మంది బాధితులు పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు కూడా! కొత్తగూడెం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న వనమా రాఘవ.. తనపై ఎన్ని కేసులు ఉన్నా అవి బయట పడకుండా పెత్తనం చేస్తున్నాడు. తాజాగా, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో అతడి నేర చరిత్ర బహిర్గతమైంది.   15 సంవత్సరాల్లో రాఘవపై 13 కేసులు నమోదైనట్లు రిమాండ్‌ రిపోర్టులో వివరించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉండటమే కాకుండా మరో 12 కేసుల్లో రాఘవ పలు సెక్షన్ల కింద నిందితుడిగా ఉన్నటు పేర్కొన్నారు. ఇవే కాకుండా కొత్తగూడెంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో మరో మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం మరో ముగ్గురు బాధితులు పాల్వంచ ఏఎస్పీ కార్యాలయంలో రాఘవపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


కేసుల వివరాలిలా..

2006లో.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇతరత్రా కారణాలను చూపుతూ వివిధ సెక్షన్ల కింద పాల్వంచ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో  కేసు నమోదైంది.

2013లో.. పంచాయతీ ఎన్నికల సమయంలో పాల్వంచ రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో డబ్బులు, బహుమతులు పంపిణీ చేస్తుండగా అరెస్టు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద రెండు కేసులు .

2018లో.. అసెంబ్లీ ఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘించినందుకు కొత్తగూడెం 3వ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.

2017లో.. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తదితర కారణాలతో కేటీపీఎస్‌ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పాల్వంచ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

2019లో.. అనుమతి లేకుండా అడవిలోకి చొరబడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాక ఫారెస్ట్‌ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు  లక్ష్మీదేవిపల్లి పరిధిలో కేసు నమోదు చేశారు.

2020లో.. పాల్వంచ పట్టణ పరిధిలోని ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని  కేసు నమోదు చేశారు.

2021లో.. పాల్వంచకు చెందిన ఫైనాన్సియర్‌ మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య ఘటనలో ఆయన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా జూలైలో టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాఘవ ఏ-1 నిందితుడిగా ఉన్నారు.


రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు

పాత పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సోమవారం మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ఏ-3, ఏ-4గా ఉన్న లోగ మాధవి (నాగరామకృష్ణ సోదరి), మండిగ సూర్యావతి (నాగరామకృష్ణ తల్లి)లను పాత పాల్వంచలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ, వైద్య పరీక్షల అనంతరం ఇద్దరినీ కొత్తగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.


రాఘవతో సోదరుడు ములాఖత్‌

భద్రాచలం:  రాఘవను ఉంచిన భద్రాచలం సబ్‌జైలు వద్దకు అతని తమ్ముడు రామకృష్ణ, బంధువులు వీరభద్రం, లక్ష్మణరావు రాగా.. సబ్‌జైలు నిబంధనల ప్రకారం వారికి అరగంట మాత్రమే ములాఖత్‌కు అనుమతిచ్చారు. అయితే, జైల్లో ఇతర ఖైదీల తరహాలోనే రాఘవను కూడా సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నామని, అతడికి ఎలాంటి ప్రత్యేక వసతులు లేవని భద్రాచలం సబ్‌జైలు సూపరింటెండెంట్‌ ఉపేందర్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-11T09:17:55+05:30 IST