నేడు ముంబైకి కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-02-20T07:32:25+05:30 IST

‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌

నేడు ముంబైకి కేసీఆర్‌

  • మహారాష్ట్ర సీఎం ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ పవార్‌తో భేటీ
  • బీజేపీ వ్యతిరేక పోరాటంపై చర్చించే అవకాశం
  • వార్దా నదిపై ప్రతిపాదిత బ్యారేజీపైనా...
  • కేసీఆర్‌ వెంట మంత్రి హరీశ్‌ రావు వెళ్లే అవకాశం

 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారంలో ముంబైలో పర్యటించనున్నారు. తొలుత ఆయన మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమవుతారు. తదుపరి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తోనూ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన వెంట మంత్రి హరీశ్‌ రావు కూడా వెళ్లే అవకాశముందని తెలిసింది.


మధ్యాహ్నం ఒంటిగంటకు ఉద్ధవ్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ, బీజేపీపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తర్వాత, ఈనెల 16న కేసీఆర్‌కు ఫోన్‌ చేసి, తమ ఆతిథ్యాన్ని అందుకోవాలంటూ ఉద్ధవ్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ‘‘బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సమాఖ్య న్యాయం, దేశం కోసం మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు సహకారాన్ని అందిస్తాం’’ అంటూ అప్పట్లో ఠాక్రే అన్నారని సీఎంవో ప్రకటన విడుదల చేసింది. ముంబై వస్తే భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దామని ఆహ్వానించారు కూడా. వీరి మధ్య బీజేపీ వ్యతిరేక పోరాటంపై చర్చ జరగనుంది.


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా వార్దా నదిపై బ్యారేజీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి మహారాష్ట్ర అనుమతి పొందాల్సి ఉంది. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. కేసీఆర్‌తోపాటు ఆయన వెంట వెళ్లే బృందానికి ఠాక్రే నివాసం ‘వర్షా’లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. భోజన చర్చల అనంతరం పవార్‌ నివాసానికి  వెళ్లి జాతీయ రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.


Updated Date - 2022-02-20T07:32:25+05:30 IST