కేసీఆర్‌ ‘ఫ్రంట్‌’పై తేజస్వి నీళ్లు!

ABN , First Publish Date - 2022-01-17T07:44:50+05:30 IST

జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రె్‌సలకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రయత్నాలకు ఇతర ప్రాంతీయ

కేసీఆర్‌ ‘ఫ్రంట్‌’పై తేజస్వి నీళ్లు!

మూడో ఫ్రంట్‌పై ఆర్జేడీ నేత అనాసక్తి

కాంగ్రె్‌సతో కలిసి ఉండేందుకే మొగ్గు!

తమిళనాడు సీఎం స్టాలిన్‌ వద్దకు కేసీఆర్‌..

స్వయంగా వెళ్లి  కలిసినా రాని సానుకూలత

బీజేపీ పట్ల గతంలో కేసీఆర్‌ వైఖరిని..

గుర్తు చేసుకుంటున్న ప్రాంతీయ పార్టీల నేతలు!


పట్నా, జనవరి 16: జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రె్‌సలకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రయత్నాలకు ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇటీవల బిహార్‌ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ యువనేత తేజస్వియాదవ్‌ను కేసీఆర్‌ స్వయంగా హైదరాబాద్‌కు పిలిపించుకుని చర్చలు జరిపినా.. ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. తేజస్వి కోసం ప్రత్యేకంగా చార్టర్డ్‌ విమానం పంపించి మరీ పిలిపించుకున్న కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లో ఆర్జేడీ బృందంతో రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీని ఓడించడం అసాధ్యమేమీ కాదని కేసీఆర్‌ చెప్పినట్లు, పలు దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోనూ ఇతర పార్టీలు బీజేపీని ఓడించిన విషయాన్ని గుర్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే తేజస్వియాదవ్‌ మాత్రం తాము కాంగ్రె్‌సకు చిరకాల మిత్రులమని చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి కేసీఆర్‌ నుంచి పిలుపు రాగానే.. తేజస్వి తన తండ్రి లాలూప్రసాద్‌ యాదవ్‌తో మాట్లాడారని, వెళితే జాతీయ రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుందని లాలూ చెప్పడంతోనే వెళ్లారని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. కానీ, ఎటువంటి కేసీఆర్‌కు ఎటువంటి హామీ ఇవ్వవద్దని లాలూ చెప్పినట్లు పేర్కొన్నాయి. తేజస్వితో సమావేశం అనంతరం కేసీఆర్‌ కూడా దీనిని ‘‘మర్యాదపూర్వక భేటీ’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. 


కేసీఆర్‌కు ప్రతిబంధకంగా గత వైఖరి!

కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ ప్రయత్నాలకు ఇతర పార్టీల నుంచి మద్దతు లభించకపోవడానికి కారణం.. గతంలో బీజేపీ పట్ల ఆయన వ్యవహరించిన తీరేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను కేసీఆర్‌ సమర్థించడం, ‘‘స్నేహపూర్వక ప్రతిపక్ష పార్టీ’’గా టీఆర్‌ఎస్‌ వ్యవహరించడాన్ని ఇతర పార్టీలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇటీవల తెలంగాణలో బీజేపీ నుంచి టీఆర్‌ఎ్‌సకు సవాళ్లు ఎదురవుతుండడంతో ఆ పార్టీ పట్ల కఠిన వైఖరి తీసుకోవాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.


దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ప్రధానంగా తెలంగాణలో తమకు అనుకూల వాతావరణం ఉందని భావిస్తోంది. రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందుకు ప్రతిగా.. కేసీఆర్‌ ఇతర పక్షాలను కూడగట్టి జాతీయ స్థాయిలో ఢీకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతనెలలో తమిళనాడుకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను కలిశారు. కానీ, తమ భేటీ మర్యాదపూర్వకమేనంటూ స్టాలిన్‌ ప్రకటించారు. అనంతరం ఇటీవల వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజాతోనూ కేసీఆర్‌ సమావేశమయ్యారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రె్‌సగానీ, యూపీఏ గానీ కాదంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ ప్రయత్నాలు ఏ దిశగా వెళతాయన్నది వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-01-17T07:44:50+05:30 IST