లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ కేసీఆర్ చేసిన ఒక్క ప్రకటనతో..

ABN , First Publish Date - 2020-04-07T19:07:46+05:30 IST

లాక్‌డౌన్‌ కొనసాగింపు ఉంటుందా..? ఇప్పుడు ప్రజల్లో సరికొత్త ఉత్కంఠ నెలకొన్నది. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సలహా ఇచ్చారు.

లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ కేసీఆర్ చేసిన ఒక్క ప్రకటనతో..

లాక్‌డౌన్‌పై ఉత్కంఠ

పొడిగించాలని పీఎంను కోరతామన్న సీఎం కేసీఆర్‌

ముందుజాగ్రత్తలపై అప్పుడే దృష్టి పెడుతున్న జనం

కొనసాగుతున్న కరోనా నివారణ చర్యలు

వరంగల్ నగరంలో జోరుగా ఇంటింటి సర్వే

లక్షా 30వేల మంది వివరాల సేకరణ

వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : లాక్‌డౌన్‌ కొనసాగింపు ఉంటుందా..? ఇప్పుడు ప్రజల్లో సరికొత్త ఉత్కంఠ నెలకొన్నది. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  సోమవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సలహా ఇచ్చారు. లాక్‌డౌన్‌ ద్వారానే కరోనాను  నియంత్రించగలుగుతామన్నది  తన నిశ్చితాభిప్రాయమని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. దీంతో లాక్‌డౌన్‌ కొనసాగితే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై జనం అప్పుడే దృష్టి పెడుతున్నారు. వాస్తవానికి  లాక్‌డౌన్‌ పూర్తవ్వడానికి ఇంకా 8 రోజుల వ్యవధి ఉంది. ఏదో విధంగా లాక్‌డౌన్‌ ఎత్తి వేస్తారన్న ప్రచారం ఇప్పటి వరకు జోరుగా సాగుతోంది. పూర్తిగా కాకపోయినా కొన్ని పరిమితులతోనైనా లాక్‌డౌన్‌ ఎత్తి వేస్తారని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి వారి ఆశలపై కేసీఆర్‌ నీళ్లు చల్లారు. లాక్‌డౌన్‌ కొనసాగించాలని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజలు కాస్త గందరగోళంలో పడ్డారు. కేంద్రం లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా కేసీఆర్ మాత్రం కొనసాగిస్తారా..? ఒకవేళ కొనసాగిస్తే ఎన్ని రోజులు ఉంటుంది..? రెండు వారాలు ఉంటుందా..? లేక జూన్ మొదటి వారం వరకు ఉంటుందా..? ఇన్ని నెలల పాటు లాక్‌డౌన్ కొనసాగితే పేద ప్రజల పరిస్థితి ఏంటి..? కేంద్రం నిర్ణయం ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి..? అన్న అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు పక్క రాష్ట్రం ఏపీలో ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్స్‌‌ను అందుబాటులోకి తేవడం.. మరో వైపు ఇండియన్ రైల్వే కూడా ఏప్రిల్ 15 నుంచి రైల్వే సర్వీసులకు టికెట్ బుకింగ్‌కు అవకాశం ఇవ్వడం చూసి ప్రజలు అయోమయంలో పడ్డారు.. మొత్తం మీద కేసీఆర్ చేసిన ప్రకటనతో ఎందుకైనా మంచిదని ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బియ్యం, పప్పులు, నూనె వంటి నిత్యావసర సరుకులను భారీ మొత్తంలో కొనేందుకు సిద్ధమవుతున్నారు. 


కొనసాగుతున్న ఇంటింటి సర్వే 

కరోనా పాజిటివ్‌ వ్యక్తులు నివసించే పరిసర ప్రాంతాల్లో కిలో మీటర్‌ మేర ఇంటింటి సర్వే విస్తృతంగా చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ఇంటింటికి తిరిగి వి దేశీ, మర్కజ్‌ ప్రయాణ నేపథ్యం ఉందా అన్న వివరాలు సేకరిస్తున్నారు. అదే విధంగా ఆ పరిసర ప్రాంతాల్లో కరోనా అనుమానిత లక్షణాలు ప్రజల్లో ఉన్నాయా అని తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు 1,30,689 మంది వివరాలు సేకరించారు. కాగా మార్చి నెల 1 నుంచి ఇప్పటి వరకు 814 మంది విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నవాళ్లను గుర్తించారు. వీరందరూ 14 రోజలు హోమ్‌ క్వారంటైన్‌ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 153 మంది సెకండ్‌ కాంటాక్ట్‌ కలిగిన  వ్యక్తులను గుర్తించి హోమ్‌ క్వారంటైన్‌ చేశారు.


అధికారుల పర్యటన

కరోనా వ్యాధి వ్యాప్తి కలిగిన ప్రాంతాలను  నో మూవ్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించారు..  ఎల్బీనగర్‌, చార్‌బౌళి, శంభునిపేట  ప్రాంతాలలో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మం తు, పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌, కమీషనర్‌ ఫమేలా సత్పతి తదితర అధికారులు పర్యటించారు. నో మూవ్‌మెంట్‌ జోన్ల పరిధిలోకి ఇతరులు ఎవరూ రాకూడదని, అలాగే ఈ జోన్ల లో ఉన్న వారెవరూ బయటకు వెళ్లకూడదని హెచ్చరించా రు..  నో మూవ్‌మెంట్‌ ఏరియాల్లో పోలీసులు పర్యటించారు. కుమార్‌పల్లిలో ఏఎ్‌సపీ, ఏసీపీలు పర్యటించారు. కరోనా వైరస్‌ నివారణకు సహకరించాలని ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమవ్వాలని సూచించారు.  కుమార్‌పల్లి, జులైవాడ, సుబేదారి, చింతగట్టు ఏరియాల్లో కాలనీలు నిర్మానుష్యంగా మారాయి.

Updated Date - 2020-04-07T19:07:46+05:30 IST