ఎస్టీ రిజర్వేషన్లు పెంచాకే కేసీఆర్‌ అడుగుపెట్టాలి

ABN , First Publish Date - 2021-04-13T06:47:27+05:30 IST

లంబాడీలకు జనాభా ప్రకారం 10శాతం రిజర్వేషన్ల పెంపు జీవో ఇచ్చాకే నాగార్జుసాగర్‌లో సీఎం కేసీఆర్‌ అడుగుపెట్టాలని, లేదంటే అడ్డుకుంటామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

ఎస్టీ రిజర్వేషన్లు పెంచాకే కేసీఆర్‌ అడుగుపెట్టాలి
త్రిపురారం మండలంలో మాట్లాడుతున్న జానా, పక్కన రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి 


తిరుమలగిరి(సాగర్‌), త్రిపురారం, ఏప్రిల్‌ 12: లంబాడీలకు జనాభా ప్రకారం 10శాతం రిజర్వేషన్ల పెంపు జీవో ఇచ్చాకే నాగార్జుసాగర్‌లో సీఎం కేసీఆర్‌ అడుగుపెట్టాలని, లేదంటే అడ్డుకుంటామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణపట్టెలోని గోడుమడక, నాయకునితండా, తిమ్మాయిపాలెం, చింతలపాలెం, త్రిపురారం, సత్యనారాయణపురం, నీలాయిగూడెం, రాగడప, అప్పలమ్మగూడెం, మా టూరు గ్రామాల్లో జానారెడ్డితో కలిసి సోమవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. జానారెడ్డి వేసిన రోడ్లపై తిరుగుతూ టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు సోయిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే 20 ఏళ్లు జానారెడ్డి మీసేవకుడిగా ఉంటారని, ఆయనకు అండగా ఆయన కుమారులతోపాటు పెద్దకొడుకు గా నేను ఉంటానన్నారు. ఓట్లు వేస్తేనే పాస్‌పుస్తకాలు, రైతుబంధు, పింఛన్లు ఇస్తామని అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని, తెలంగాణ మీ అయ్యా జాగిరా ఖబార్దర్‌ అని హెచ్చరించారు. బోడ సునిల్‌కుమార్‌ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటూ తాను బతికితే కేసీఆర్‌పై యుద్ధం చేస్తానని, చనిపోతే నిరుద్యోగులు కేసీఆర్‌ పతనం చూడాలని కోరుకున్నాడని, అతడి చివరికోరికను నెరవేర్చే బాధ్యత యువకులపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు బెల్లయ్యనాయక్‌, నాయకులు కర్నాటి లింగారెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, రాంరెడ్డి, రమావత్‌ కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:47:27+05:30 IST