నీతి ఆయోగ్‌కు కేసీఆర్‌ వెళ్లాలి!

ABN , First Publish Date - 2022-08-07T09:00:46+05:30 IST

నీతీ ఆయోగ్‌ సమావేశాన్ని కేసీఆర్‌ బహిష్కరించడం ద్వారా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ తమ చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించకున్నట్లయిందని పీపీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

నీతి ఆయోగ్‌కు కేసీఆర్‌ వెళ్లాలి!

మేం విమానాన్ని ఏర్పాటు చేస్తాం.. హాజరై నిధులు, వరద సాయంపై ప్రశ్నించండి: రేవంత్‌ రెడ్డి


న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నీతీ ఆయోగ్‌ సమావేశాన్ని కేసీఆర్‌ బహిష్కరించడం ద్వారా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ తమ చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించకున్నట్లయిందని పీపీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. నీతీ ఆయోగ్‌ సమావేశానికి వెళితే తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రధానిని సీఎం ముఖాముఖిగా ప్రశ్నించే అవకాశం ఉంటుంద న్నారు. ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు సమావేశాన్ని బహిష్కరించడం అంటే మోదీకి  కేసీఆర్‌ లొంగిపోవడమేనని పేర్కొన్నారు. ‘‘మరి.. మోదీకి లొంగిపోయి ఒంగిపోతారా? తెలంగాణ ప్రజలు లొంగరు అని నిరూపిస్తారా? అన్నది సమావేశానికి కేసీఆర్‌ హాజరవడంపై ఆధారపడి ఉంటుంది’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.  శనివారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రతినిధిగా నీతీ ఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్‌ హాజరవ్వాలని.. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, వరద సాయం గురించి ప్రశ్నిచాలని డిమాండ్‌ చేశారు. సమావేశానికి వెళ్లేందుకు అవసరమైతే కాంగ్రెస్‌ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ‘‘నీతీ ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాకుంటే మీకు లాభం జరగవొచ్చు.  మీ ఈడీ, ఐటీ కేసుల్లో ఉపశమనం లభించవచ్చు. కానీ మీరు హాజరై ప్రశ్నించడం ద్వారా  తెలంగాణకు మేలు జరుగుతుంది. రాష్ట్రానికి నిధులొస్తాయి. రాజకీయ అవసరాల కోసం తనమీద, తన కుటుంబం ఉన్న కేసుల నుంచి మోదీని రక్షణ కోరడానికి సమావేశానికి గైర్హాజరవ్వడం క్షమించరాని నేరం.


తెలంగాణ ప్రజల భావా న్ని, ఆలోచనను ప్రధానికి వినిపించే అవకాశాన్ని వదలడాన్ని తెలంగాణ జాతి క్షమించదు’’ అని వ్యాఖ్యానించారు. గత ఏడున్నరేళ్లలో మోదీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ వ్యతిరేకించలేదని గుర్తుచేస్తూ టీఆర్‌ఎ్‌సను ఎన్డీఏ భాగస్వామిగా, సీఎం కేసీఆర్‌ను మోదీకి ముఖ్యమైన అనుచరుడిగా తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. అయినా మోదీని కేసీఆర్‌ విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఏసీబీ, విజిలెన్స్‌, అసెంబ్లీ వంటి వ్యవస్థలను విధ్వం సం చేయడంలో మోదీకి సీఎం కేసీఆర్‌ ఏకలవ్య శిష్యుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిన సంస్థలను విపక్షాలను నిర్వీర్యం చేయడానికి, సొంత పార్టీలో అనుమా నం ఉన్న వ్యక్తులను వేధించడానికి కేసీఆర్‌ ఉపయోగిస్తున్నారని, జాతీయ స్థాయిలోనూ దేశ భద్రత కోసం వాడాల్సిన సంస్థలను మోదీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు వాడుతోందని ఆరోపించారు.


అర్హత, పనితనాన్ని బట్టే హోదా 

దాసోజు శ్రవణ్‌ బీజేపీలో చేరికపై రేవంత్‌ స్పంది స్తూ.. బీజేపీలో కండువా కప్పుకున్న రోజు మాత్రమే పండుగ అని, కాంగ్రె్‌సలో ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఇక 34 ఏళ్ల పాటు పార్టీలో ఉన్న తనకు స్టార్‌ క్యాంపెయినర్‌ పదవిచ్చి మూడేళ్ల కింద పార్టీలో చేరిన వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యపై రేవంత్‌ నర్మగర్భంగా స్పందించారు. ‘‘హోం గార్డు 34 ఏళ్లు పనిచేసినా కూడా ఆ వ్యక్తి కానిస్టేబుల్‌ కాబోడు. కానీ సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి నేరుగా ఐపీఎ్‌సగా వచ్చి జిల్లా ఎస్పీ అవుతారు. అర్హత, పనితనాన్ని బట్టి హోదా కల్పిస్తారు. బీజేపీలో వెంకయ్య నాయుడు జాతీయ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మోదీ, అమిత్‌ షా ఎక్కడున్నారు? ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు, ఆడ్వా ణీ,  మురళీ మనోహర్‌ జోషి ఎక్కడున్నారు? 2018లో బండి సంజయ్‌ ఎక్కడున్నారు? రాజకీయాల్లో ఒకరి అదృష్టాన్ని ఒకరు గుంజుకోలేరు, చెడగొట్టలేరు. చెడగొట్టాలనుకున్న వారు బాగుపడ్డట్లు లేదు.’’ అని వ్యాఖ్యానించారు. తాను పీసీసీ అధ్యక్షుడయ్యాక ఎంత మంది పార్టీలోకి వచ్చారు..? ఎంత మంది పార్టీ నుంచి వెళ్లారో విశ్లేషించాలని సూచించారు. కాగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని జైళ్లో పెట్టి ఉరితీద్దామని కుట్ర చేస్తున్న మోదీ, అమిత్‌ షా పక్కన రాజగోపాల్‌ రెడ్డి చేరడం ఏ రకంగా సమర్థనీయం? అని రేవంత్‌ ప్రశ్నించారు. తన వెనుక చంద్రబాబు ఉన్నారన్న రాజగోపాల్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందిస్తూ.. 2018లో పొత్తులో భాగంగా చంద్రబాబు మద్దతుతోనే రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.


మునుగోడులో టీడీపీ కార్యకర్తలు పనిచేసి గెలిపించలేదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘‘జార్ఖండ్‌లో కోల్‌ ఇండియాకు సంబంధించిన రూ. 21 వేల కోట్ల విలువైన టెండర్‌ మీ కంపెనీకి వచ్చిందా లేదా? రైల్వేకు సంబంధించిన పనులు మీ సంస్థకు వచ్చాయా రాలేదా? అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మీకు పనులు వచ్చాయా రాలేదా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పనులు వస్తే మీరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంస్థకు అధిక కమిషన్లు తీసుకొని బదిలీ చేశారా లేదా?’’ అని ప్రశ్నించారు. 


అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యలు తప్పు

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని అద్దంకి దయాకర్‌ దూ షించడాన్ని రేవంత్‌ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో అలాంటి పదజాలాన్ని తాను సమర్థించబోనని, దీనిపై అంతర్గతంగా చర్చించుకున్నామని, ఏం చర్యలు తీసుకోవాలనేదానిపై పార్టీ స్పష్టతతో ఉందని చెప్పారు.  పార్టీని వదిలేసిన రాజగోపాల్‌ రెడ్డిపైనా అలాంటి వ్యా ఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్‌ ఆమోదించదబోదన్నారు.  

Updated Date - 2022-08-07T09:00:46+05:30 IST