ఈటల చిన్నోడు.. వానితో అయ్యేదీ చచ్చేదీ లేదు

ABN , First Publish Date - 2021-07-25T07:53:56+05:30 IST

‘‘ఈటల రాజేందర్‌ చిన్నోడు. వానితోని అయ్యేది లేదు.. సచ్చేదీ లేదు. హుజూరాబాద్‌ ఎన్నికలు చిన్న విషయం. దళితబంధు పథకం మామూలు విషయం కాదు...

ఈటల చిన్నోడు.. వానితో అయ్యేదీ చచ్చేదీ లేదు

  • హుజూరాబాద్‌లో పథకం విజయంపైనే
  • దళిత జాతి భవిత ఆధారపడి ఉంటుంది
  • తనుగుల ఎంపీటీసీ భర్తకు సీఎం ఫోన్‌

జమ్మికుంట రూరల్‌, జూలై 24: ‘‘ఈటల రాజేందర్‌ చిన్నోడు. వానితోని అయ్యేది లేదు.. సచ్చేదీ లేదు. హుజూరాబాద్‌ ఎన్నికలు చిన్న విషయం. దళితబంధు పథకం మామూలు విషయం కాదు. అందరం కమిట్‌మెంట్‌తో పని చేసి విజయవంతం చేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ వాసాల నిరోష భర్త రామస్వామితో సీఎం కేసీఆర్‌ శనివారం ఫోన్లో మాటాడారు. దళిత బంధు పథకంపై చర్చించడానికి ఈనెల 26న హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రతినిధులు ప్రగతి భవన్‌కు రావాలని ఆహ్వానించారు. సంబంధిత ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ మాట్లాడతారని చెప్పారు. ఈ సందర్భంగా రామస్వామితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హుజూరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే దళితబంధును ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని సూచించారు. ‘‘ఎచ్చులు, కచ్చులు మాట్లాడే దరిద్రులు ఉంటారు. ఇది చాలా బాధ్యతతోని, చాలా ఓపికతోని చేసే గొప్ప పని. నేను, చీఫ్‌ సెక్రటరీ కలిసి ప్రత్యేకంగా నీ పేరు సెలక్ట్‌ చేశాం. ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో నీ పేరు వచ్చింది. మీ జిల్లా కలెక్టర్‌ మీకు ఇప్పుడు ఫోన్‌ చేస్తాడు. రేపు ఆయన దగ్గర మీరు లంచ్‌ చేస్తారు. ఆ సందర్భంగా, 26న జరిగే కార్యక్రమంపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో అవగాహన చేసుకుంటారు. గ్రామానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఆరోజు అంతా మీ మీ మండల కేంద్రాల్లో జమయితరు. బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో అన్ని మండలాల నుంచి హుజూరాబాద్‌ టౌన్‌కు వస్తారు. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహానికి నమస్కారం చేసుకొని హైదరాబాద్‌ వస్తారు’’ అని వివరించారు. ఈ పథకం సక్సెస్‌ మీద తెలంగాణ దళిత జాతి సక్సెస్‌ ఆధారపడి ఉంటుందని, కాబట్టి దీన్ని చాలా గొప్పగా తీసుకుపోవాలని సూచించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేద్దామని చెప్పారు. అన్ని జిల్లాల్లో గొప్పగా సక్సెస్‌ చేసి, దేశానికి, ప్రపంచానికి ఆదర్శమవుతామన్నారు.


ఈటల నన్ను పక్కనపెట్టిండు..

మీరు ఫిక్స్‌ అయితే తప్పకుండా తమ దళిత జాతికి న్యాయం జరుగుతుందనే సంపూర్ణమైన భరోసా ఉందని రామస్వామి ముఖ్యమంత్రితో అన్నారు. ‘‘మీ నాయకత్వంలో 2001 నుంచి పని చేస్తున్న. సందర్భం వచ్చిన ప్రతి విషయంలో ఈటల రాజేందర్‌ నన్ను పక్కకు పెట్టిండు. అయినా, మీ నాయకత్వం, ప్రభుత్వంలో పనిచేసుకుంటూ వచ్చాను. 2018 ఎన్నికల్లో కూడా నాకు ఎంపీటీసీ టికెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన. గెలిచిన తర్వాత కూడా ఈటల రాజేందర్‌ దగ్గరకు ఎప్పుడూ పోలేదు. మీ నాయకత్వంలో పనిచేసిన. నాకు దేవుని లెక్క ఉన్నది పరిపాటి రవీందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌ సార్‌లు మాత్రమే సార్‌’’ అని వివరించారు.

Updated Date - 2021-07-25T07:53:56+05:30 IST