త్వరలో ‘కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్‌’

ABN , First Publish Date - 2022-05-15T08:39:41+05:30 IST

త్వరలోనే వైద్య, ఆరోగ్యశాఖలో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతోంది. అదే.. మ

త్వరలో ‘కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్‌’

  • పిల్లలు, గర్భిణుల కోసం కొత్త పథకం
  • గర్భిణులకు 3, 5 నెలల్లో కిట్ల పంపిణీ
  • తొలుత 9 ఏజెన్సీ జిల్లాల్లో అమలు
  • గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు
  • స్థలాలు గుర్తించండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు
  • ఒక్కో కిట్‌ విలువ రూ.2000


హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే వైద్య, ఆరోగ్యశాఖలో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతోంది. అదే.. ‘కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్‌’. దీనిపై ఇప్పటికే నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలోనే అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఈ న్యూట్రియంట్‌ కిట్‌ ఉపయోగపడుతుందని వైద్యవర్గాలు అంటున్నాయి. గర్భం దాల్చాక మూడో నెలలో ఒకసారి, ఐదో నెలలో మరోసారి దీన్ని అందజేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులో ఇటువంటి పథకం అమలవుతోంది. కొన్ని నెలల క్రితం రాష్ట్రం నుంచి మహిళా ఐఏఎ్‌సల బృందం తమిళనాడుకు వెళ్లింది. ‘అమ్మకిట్‌’ పేరుతో అక్కడ అమలవుతున్న పథకం తీరు తెన్నులపై అధ్యయనం చేసింది. అక్కడిలాగే తెలంగాణలోనూ ఓ పథకాన్ని అమలు చేయొచ్చంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 


తొలుత 9 ఏజెన్సీ జిల్లాల్లో.. 

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. గర్భిణుల్లోనూ రక్తహీనత, పోషకాహార లోపం ఉన్నట్లు తేలింది. ప్రధానంగా 9 ఏజెన్సీ జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది. తొలుతగా కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్‌ను ఆ జిల్లాల్లోనే ఇవ్వాలని నిర్ణయించింది. అయితే చిన్నారుల్లో ఎంతమందికి ఇస్తారు? ఎప్పటి నుంచి ఇస్తారు ? అనే దానిపై వైద్యశాఖ వద్ద స్పష్టత లేదు. పైగా వారి లెక్కలను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోలేదు. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. 


కిట్‌లో ఏముంటుందంటే..

కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్‌లో ఐదు రకాల ఐటమ్స్‌ ఉంటాయి. ఒక కేజీ న్యూట్రిషనల్‌ బాటిల్స్‌ రెండు, ఐరన్‌ టానిక్స్‌ బాటిల్స్‌ మూడు, కేజీ ఎండు ఖర్జూరాలు, అరకిలో నెయ్యి, ఒక ఆల్బెండజోల్‌ మాత్ర ఈ కిట్‌లో ఉంటాయి. ఈ కిట్‌కు దాదాపు రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా. కాగా, రాష్ట్రంలో ఏటా దాదాపు 6లక్షల ప్రసవాలు జరుగుతాయి.  గత ఏడాది 6.16 లక్షల మంది గర్భిణులు రిజిష్టర్‌ అయ్యారు. వారికి రెండేసి కిట్ల చొప్పున అందజేస్తే ఏడాదికి రూ.247  కోట్లు ఖర్చవుతుందని వైద్యశాఖ అంచనా వేసింది. 9 ఏజెన్సీ జిల్లాల వరకే అయితే న్యూట్రియంట్‌ కిట్స్‌ కోసం రూ. 50 కోట్లు అవసరం అవుతాయి. 

Updated Date - 2022-05-15T08:39:41+05:30 IST