దళితబంధుతో కేసీఆర్‌ కొత్తనాటకం

ABN , First Publish Date - 2021-09-07T17:36:45+05:30 IST

సీఎం కేసీఆర్‌ దళితుల ఓట్ల కోసం..

దళితబంధుతో కేసీఆర్‌ కొత్తనాటకం

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి


నయీంనగర్‌: సీఎం కేసీఆర్‌ దళితుల ఓట్ల కోసం ఆడుతున్న కొత్త నాటకమే ‘దళితబంధు’ పథకమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. హనుమకొండ 53వ డివిజన్‌ లష్కర్‌సింగారంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆ ధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహే్‌షకుమార్‌ గౌడ్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి, అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే అనసూయ(సీతక్క)లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ. కోడికి మసాలా పెట్టి దూలానికి కట్టేసినట్టు సీఎం కేసీఆర్‌ పథకాలు ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులకు కొంత మంది పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం కారణంగానే గత ఏడేళ్లుగా దళితులపై దాడులు పెరిగాయని, మహిళలపై అత్యాచారాలు, పరువు హత్యలు, ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు ఈ రెండేళ్లు ఐకమత్యంగా కలిసి ఉండి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కృషిచేయాలన్నారు. 


హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడున్నర ఏళ్లలో సీఎం కేసీఆర్‌ ఏ రోజైనా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావుఫూలేల చిత్రపటాలకు పూలమాల వేయడం చూశారా అని ప్రజలను అడిగారు. ప్రతీ ఒక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తారా.. రాజీనామా చేస్తారా అని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహే్‌షగౌడ్‌ మాట్లాడుతూ.. దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించి తీసేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. కారణం లేకుండా కేబినెట్‌ హోదాలో ఉన్న ఒక దళిత మంత్రిని ఎందకు తీసేశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం గరిష్ట భూపరిమితి ద్వారా లక్షలాది పేద ప్రజలకు భూమి పంచి ఇచ్చిందన్నారు. 2006లో అటవీ భూముల హక్కు చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనులకు, ఆదివాసీలకు భూమి చెందేలా మూడు లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చిందని, కాని కేసీఆర్‌ ప్రభుత్వం ఏడేళ్లుగా హక్కు పత్రాలు ఇవ్వకుండా వారికి అన్యాయం చేస్తూ ఆఖరికి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రైతు బంధుకు కూడా వర్తింపచేయట్లేదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. 


Updated Date - 2021-09-07T17:36:45+05:30 IST