నీళ్ల యుద్ధం పేరుతో కేసీఆర్‌ కొత్త డ్రామా

ABN , First Publish Date - 2021-06-24T09:30:01+05:30 IST

నీళ్ల యుద్ధం పేరుతో సీఎం కేసీఆర్‌, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.

నీళ్ల యుద్ధం పేరుతో కేసీఆర్‌ కొత్త డ్రామా

  • రాయలసీమ లిఫ్టుకు ఏడాది కిందటే ఏపీలో జీవో
  • సీఎం, మంత్రులు ఇప్పుడు మేల్కొన్నారా?: భట్టివిక్రమార్క 
  • నీళ్ల పేరిట రాజకీయ లబ్ధికి  కేసీఆర్‌ యత్నం: పొన్నాల
  • సీఎం అసమర్థత వల్లే కృష్ణా జలాల దోపిడీ: జీవన్‌రెడ్డి


హైదరాబాద్‌/బంజారాహిల్స్‌/కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): నీళ్ల యుద్ధం పేరుతో సీఎం కేసీఆర్‌, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కృష్ణా నీటిని రాయలసీమ లిఫ్టు ద్వారా తరలించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏడాది కందటే జీవో ఇస్తే ఇప్పుడు మేల్కొన్నారా అని ప్రశ్నించారు. నీటి తరలింపుపై ఆనాడు ఎంత మొత్తుకున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పేరుకు మాత్రం తెలంగాణ ప్రయోజనాలు అంటారని, కానీ ఆయన కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టడం లేదని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్‌ పేరుతో ఏపీ ప్రభుత్వం నీళ్లను తరలించుకుపోతే సాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ ఆయకట్టుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. హైదరాబాద్‌ కు మంచినీళ్లు వచ్చే అవకాశం కూడా ఉండదన్నారు. కేసీఆర్‌కు సంబంధించిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని, ప్రజలు ఆయనకు తప్పకుండా బుద్ధి చెప్పాలని భట్టి పిలుపునిచ్చారు. నీళ్ల సెంటిమెంట్‌తో తెలంగాణ ప్రజలను పక్కదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని పొన్నాల లక్ష్యయ్య ఆరోపించారు.


జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం కోసం కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని ఆరోపిస్తున్న మంత్రులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్‌ అసమర్థత, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో లాలూచీ కారణంగానే కృష్ణా జలాల దోపిడీ జరుగుతున్నదని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కరీంనగర్‌లో ఆరోపించారు. ఏపీ అక్రమాలపై కేంద్రం, రాష్ట్రపతి తలుపుతట్టాలని, అవసరమైతే మరో ఉద్యమం చేపట్టాలన్నారు.


Updated Date - 2021-06-24T09:30:01+05:30 IST