జగన్‌ సూచన మేరకే సీఎం కేసీఆర్‌ వాయిదా కోరారు

ABN , First Publish Date - 2020-08-01T07:09:15+05:30 IST

ఏపీ సీఎం జగన్‌తో ఉన్న ఒప్పందం మేరకే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్‌ పట్టుబడుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. జల వివాదాల పరిష్కారంపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించాయి. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు

జగన్‌ సూచన మేరకే సీఎం కేసీఆర్‌ వాయిదా కోరారు

  • ఏపీలో కొత్త ప్రాజెక్టు టెండర్లు 17న ఖరారు
  • ఆ తర్వాత భేటీ నిర్వహించి లాభమేంటి?
  • ప్రాజెక్టులపై ఏపీ సీఎంను ఎందుకు ప్రశ్నించరు?
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విపక్షాల సూటి ప్రశ్న
  • బండి సంజయ్‌, అరుణ, వంశీచంద్‌ విమర్శలు


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్‌తో ఉన్న ఒప్పందం మేరకే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్‌ పట్టుబడుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. జల వివాదాల పరిష్కారంపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించాయి. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కొత్త ప్రాజెక్టు టెండర్లు 17న ఖరారవుతున్నాయని, ఆ తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించి లాభమేంటి? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌, ఆ పార్టీ నేత డీకే అరుణ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘20వ తేదీ తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ కేంద్రాన్ని కోరడంలో ఆంతర్యమేంటి? కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటే వచ్చే నష్టమేంటి? ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదు.. అరగంట పాటు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటే చాలు.. ఆ మాత్రం తీరిక కూడా సీఎంకు లేదా? టెండర్లు ఖరారయ్యాక సమావేశం నిర్వహించి లాభమేంటి?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.


జల వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తున్న కేసీఆర్‌... ఏపీ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై జగన్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఒక వేళ టెండర్లను అడ్డుకుంటే... తన బండారాన్ని జగన్‌ బయటపెడతారని కేసీఆర్‌ భయపడుతున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆగస్టు 5న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించగా.. జగన్‌ సూచన మేరకు 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్‌ కోరుతున్నారని ఆరోపించారు. శుక్రవారం సంజయ్‌ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ హక్కులు కాపాడడంలో మొదటి నుంచీ కేసీఆర్‌ విఫలమవుతున్నారని విమర్శించారు. ఏపీ జారీ చేసిన జీవో 203పై కేసీఆర్‌ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని మండిపడ్డారు. 2016 జూన్‌ 21న జరిగిన సమావేశంలో పాల్గొన్న కేసీఆర్‌... కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాగా 555 టీంఎసీలు డిమాండ్‌ చేయాల్సి ఉండగా, 299 టీఎంసీల నీటినే వాడుకుంటామని అంగీకరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.


అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఐదు సార్లు లేఖలు రాసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా కేంద్రానికి లేఖ రాయకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కన్నా మించిన అంశం ఏముందని నిలదీశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైన కేసీఆర్‌.. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంరఽధా వారి ఓట్ల కోసం పాలమూరు రైతుల ప్రయోజనాలను కేసీఆర్‌ ఫణంగా పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌ ప్రాజెక్టులు వెంటనే పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. జూరాల నుంచి 5 టీఎంసీలు, నార్లాపూర్‌ నుంచి 4 టీఎంసీలు తీసుకునేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సూచించారు.


10వ తేదీలోపే నిర్వహించాలి

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ వాయిదాకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కూడా కేసీఆర్‌ మౌనంగానే ఉన్నారని దుయ్యబట్టారు. ఈ పథకం పనులకు పిలిచిన టెండర్లు 19వ తేదీలోపే ఖరారు కానున్నాయని, ఆ తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్వహించి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను ఏపీ ప్రబుత్వం ఖాతరు చేయబోదని, అపెక్స్‌ కమిటీలోనే న్యాయం జరగాల్సి ఉందన్నారు. సమావేశం జరిగే సమయానికే టెండర్‌ ప్రక్రియ ముగిసిపోతే.. కాంట్రాక్టరు కోర్టుకు వెళ్లి మరీ పనులు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఆగస్టు 10లోపే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-08-01T07:09:15+05:30 IST