ఖరీఫ్‌ పంట నష్టం 2,481 కోట్లు

ABN , First Publish Date - 2020-10-21T08:19:29+05:30 IST

వానాకాలంలో చేతికొచ్చిన పంట చేలన్నీ వరద తాకిడికి దెబ్బతిన్నాయి. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.

ఖరీఫ్‌ పంట నష్టం 2,481 కోట్లు

12,32,546 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

వరద నష్టంపై కేంద్రానికి కేసీఆర్‌ లేఖ


హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో చేతికొచ్చిన పంట చేలన్నీ వరద తాకిడికి దెబ్బతిన్నాయి. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కలిగిన నష్టంపై వ్యవసాయశాఖ ఓ అంచనాకు వచ్చింది. 4,10,580 ఎకరాల్లో వరి, 6,75,053 ఎకరాల్లో పత్తి, 1,46,913 ఎకరాల్లో ఇతర పంటలు కలిపి మొత్తం 12,32,546 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొంటూ అధికారులు నివేదిక రూపొందించారు. 6,97,471 మంది అన్నదాతలు పంటలు కోల్పోయారు. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం కలిగింది. సగటున ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు రూ.2,481 కోట్ల విలువైన పంట నష్టం జరిగినట్లు లెక్క తేలింది.


రాష్ట్ర వ్యాప్తంగా 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే, వర్షాల ప్రభావం భారీగా పడింది. సుమారు 12.33 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. అయితే, పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా సమాచారం కోరలేదు. భారీ వర్షాలతో పంటలు నష్టపోగానే ఏఈవోలు తమ క్లస్టర్‌ పరిధిలో ఏ పంట? ఎంత విస్తీర్ణం దెబ్బతిన్నదనే వివరాలు రైతుల నుంచి సేకరించారు. ఏవోలు వీటిని పర్యవేక్షణ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట నష్టం వివరాలను పంపించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ఏఈవోలు పీసీల్లో అధికారికంగా వివరాలు నమోదు చేయలేదు. కేవలం క్లస్టర్‌ వారిగా వివరాలు సేకరించి తమ వద్ద పెట్టుకున్నారు. జిల్లాలవారీగా లెక్కలు తీసి రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌కు ఆఫ్‌లైన్‌లో వివరాలు పంపించారు. అయితే ప్రభుత్వం ఎప్పుడు కోరితే అప్పుడు నివేదిక ఇవ్వటానికి సర్వే చేసి ఉంచినట్లు ఓ ఏడీఏ తెలిపారు. వరి, పత్తికి కనిష్ఠంగా రూ.25 వేలు, గరిష్ఠంగా రూ.35 వేల చొప్పున రైతులు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి కూడా నష్టపోయారు.  


రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం

భారీ వర్షాలతో పెద్ద ఎత్తున రైతులు పంటలు నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో సాయం చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ఈనెల 22న రాత్రికి కేంద్ర బృందం నష్టాన్ని పరిశీలించడానికి హైదరాబాద్‌కు రానుంది. 23న వరద నష్టం జరిగిన ప్రాంతాలన్నీ తిరిగాకా... తిరుగు ప్రయాణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా నష్టాన్ని అంచనా వేసి, నివేదికలు పంపించగా... కేంద్ర బృందం వచ్చేలోపు సమగ్ర వివరాలను ఆ బృందానికి అందించనున్నారు. 

Updated Date - 2020-10-21T08:19:29+05:30 IST