అసెంబ్లీలో KTR కీలక ప్రకటన.. మెట్రో తరహాలో ఇక బస్సులు.. రెండేళ్లలో పూర్తి!

ABN , First Publish Date - 2022-03-13T15:17:48+05:30 IST

విశ్వనగరంగా మారుతున్న గ్రేటర్‌లో విదేశాల్లో మాదిరిగా ప్రజా రవాణాను అందుబాటులోకి..

అసెంబ్లీలో KTR కీలక ప్రకటన.. మెట్రో తరహాలో ఇక బస్సులు.. రెండేళ్లలో పూర్తి!

  • ఆధునిక రవాణా వ్యవస్థ ఈబీఆర్‌టీఎస్‌
  • అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ ప్రకటన
  • నగరానికి మరో కొత్త ప్రాజెక్టు.. 
  • ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ నివారణకు చర్యలు

విశ్వనగరంగా మారుతున్న గ్రేటర్‌లో విదేశాల్లో మాదిరిగా ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. నగరంలో ట్రాఫిక్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులతోపాటు సాధారణ ప్రజలకు సులభతరమైన ప్రయాణాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ప్రధానంగా ఐటీ  సంస్థలకు వెళ్లే మార్గాల్లో మెట్రో రైలు తరహాలో త్వరలో ఎలక్ట్రిక్‌ బస్సులు  అందుబాటులోకి రానున్నాయి.


హైదరాబాద్‌ సిటీ : నగరంలోని కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ నుంచి కోకాపేట్‌ వరకు ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఈబీఆర్‌టీఎస్‌) అందుబాటులోకి రానుంది. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ట్రాఫిక్‌ రద్దీని నివారించడంలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రూ.2,500 కోట్లు కేటాయిస్తున్నామని, రానున్న రెండేళ్లలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సంస్థలు అధికంగా ఉండే గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌, కోకాపేట ప్రాంతాల్లో మెట్రో నియో లేదా మెట్రో లైట్‌ ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి చేపట్టాలని ఎల్‌అండ్‌టీ, మెట్రో అధికారులు కొంతకాలంగా భావిస్తున్నారు. అయితే, కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట వరకు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఆర్‌టీఎస్‌)ను ఏర్పాటు చేసే విషయంపై అధ్యయనం చేసిన అధికారులు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. కాగా, ఈబీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టు కింద కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ నుంచి పలు ప్రాంతాలను కలుపుతూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు సుమారు 20 కి.మీ. ఎలివేటెడ్‌ మార్గంలో ఈబీఆర్‌టీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎల్‌అండ్‌టీ అనుకుంటున్న తరుణంలో మంత్రి కేటీఆర్‌ తాజాగా చేసిన ప్రకటనతో ప్రాజెక్టుకు రూపం రానుంది.


పీపీపీ-హెచ్‌ఏఎం పద్ధతిలో..

రూ.2500 కోట్లతో కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ నుంచి కోకాపేట్‌ వరకు నిర్మించనున్న ఈబీఆర్‌టీఎస్‌ బస్సులు ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌ షిప్‌ (పీపీపీ)- హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం)లో నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంల్‌) సాయంతో హెచ్‌ఎండీఏ ఈ ప్రాజెక్టును చేపడుతుందని, టీఎ్‌సఐఐసీ కూడా ఇందులో భాగస్వామిగా ఉంటోందని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రాజెక్టు పూర్తిగా మెట్రో రైలును పోలి ఉంటుందని, ఆర్టిక్యులేటెడ్‌ బస్‌ యూనిట్లు ఎలక్ర్టిక్‌ ట్రాక్షన్‌తో ఎలివేటెడ్‌ వయా డక్టుపై నడుస్తాయని అధికారులు చెబుతున్నారు.


జంక్షన్‌గా మారనున్న కేపీహెచ్‌బీ..

కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట్‌ వరకు 22 కి.మీ. మేరకు చేపట్టనున్న ఈబీఆర్‌టీఎస్‌ ద్వారా కేపీహెచ్‌బీ జంక్షన్‌గా మారనుంది. వాస్తవంగా ఐటీ సంస్థలు అధికంగా ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌, హైటెక్‌సిటీ ప్రాంతాలకు మియాపూర్‌, చందానగర్‌, బీహెచ్‌ఈఎల్‌, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల నుంచి రోజూ వేలాదిమంది ఉద్యోగులు వస్తుంటారు. అయితే, ప్రస్తుతం మెట్రో కారిడార్‌-1 కింద ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మార్గం ద్వారా కొంతమంది మాత్రమే ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మిగతా ఉద్యోగులు సొంత వాహనాలతో కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ తరుణంలో కొత్తగా రానున్న ఈబీఆర్‌టీఎస్‌ బస్సులు కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ వైపుగా వెళ్లి ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ మొత్తంగా తిరగనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయా ప్రాంతాల నుంచి రోజులో తిరిగే దాదాపు 5లక్షల వాహనాల రద్దీని కొంతమేరకైనా తగ్గించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated Date - 2022-03-13T15:17:48+05:30 IST