బీజేపీని ఎదుర్కోవాలంటే కేసీఆరే!

ABN , First Publish Date - 2020-12-05T08:55:19+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీని ఎదుర్కోగలిగిన సమర్థ నాయకుడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఆయన సమర్థంగా పాలిస్తున్నారని,

బీజేపీని ఎదుర్కోవాలంటే కేసీఆరే!

దక్షిణాదిలోనే భవిష్యత్తు ఉన్న నేత

యోగి పర్యటించిన చోట బీజేపీని ఓడించాం

మేయర్‌ ఎన్నికపై నేడు చర్చిస్తాం: అసదుద్దీన్‌

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీని ఎదుర్కోగలిగిన సమర్థ నాయకుడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఆయన సమర్థంగా పాలిస్తున్నారని, కొన్ని సీట్లు పోయినంత మాత్రాన రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సీఎం దక్షిణ భారతదేశంలోనే భవిష్యత్తు ఉన్న నాయకుడని కొనియాడారు. కేసీఆర్‌ను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పారు.


జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఒవైసీ మీడియాతో మాట్లాడారు. నగరంలో అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్‌ పర్యటించిన డివిజన్లలో బీజేపీని ఓడించామన్నారు. పాత బస్తీలో సర్జికల్‌ స్ర్టైక్స్‌ చేస్తామన్న బీజేపీని డెమోక్రటిక్‌ స్ట్రైక్స్‌తో చిత్తు చేశామని వ్యాఖ్యానించారు. తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ 44 సీట్లను నిలబెట్టుకున్నామని ప్రస్తావించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విషయంలో శనివారం పార్టీలో చర్చిస్తామన్నారు.


హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 34 డివిజన్లు ఉండగా 33 గెలిచామని, సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో 12 డివిజన్లు పోటీ చేసి 9 గెలిచామని, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 2 డివిజన్లు పోటీ చేసి రెండూ గెలిచామని తెలిపారు. కేరళ, అసోంలలో ముస్లిం పార్టీలు గట్టిగా పని చేస్తున్నందున ఆ రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేయదని స్పష్టం చేశారు. 


Updated Date - 2020-12-05T08:55:19+05:30 IST