ముంపునకు కేసీఆరే కారణం

ABN , First Publish Date - 2022-07-23T10:30:12+05:30 IST

: కాళేశ్వరం ప్రాజెక్టు ముంపునకు సీఎం కేసీఆర్‌ కారణమని, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌, డి జైన్‌ చేసింది కేసీఆరేనని, దీనికి ఆయనే బాధ్యత వ హించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

ముంపునకు కేసీఆరే కారణం

  • ఆయనే బాధ్యత వహించాలి
  • రౌండ్‌టేబుల్‌లో వక్తల ఆరోపణ
  • ఇంజనీర్లు చెప్పినా విన్లే: ఈటల 
  • కేసీఆర్‌పై అక్రమాస్తుల కేసు పెట్టాలి: మధుయాష్కీ 
  • హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితోవిచారణ జరపాలి: కోదండరాం
  • శ్వేతపత్రానికి సీపీఐ డిమాండ్‌ 

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు ముంపునకు సీఎం కేసీఆర్‌ కారణమని, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌, డి జైన్‌ చేసింది కేసీఆరేనని, దీనికి ఆయనే బాధ్యత వ హించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కాళేశ్వరం ముంపు- మానవ తప్పిదమా? ప్రకృతి వైపరీత్యామా’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్ష, కార్యదర్శులు బి.వేణుగోపాల్‌రెడ్డి, సాదిక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఇంజనీర్లు, వివిధ పార్టీల ప్రముఖులు, మేధావులు హాజరై... అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌ చేస్తున్నప్పుడు ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్‌ విన్లేదు. నేనే డిజైనర్‌, నేనే సృష్టికర్త అనేవారు. కాళేశ్వరం పంపుల ముంపునకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలి. ప్రాజెక్టులో కరెంట్‌ వాడినా వాడకపోయినా ఏడాదికి స్థిరచార్జీల కింద రూ.1500 కోట్లు చెల్లించాలి.


 కాళేశవరంతో పండే పంటలకన్నా నీళ్లివ్వడానికి అయ్యే ఖర్చు అధికం’ అని అన్నారు. ‘కాళేశ్వరంతో నీటమునుగుతున్న భూములన్నీ సేకరించాలి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టాలి’ అని డిమాండ్‌ చేశారు. టీపీపీసీ ప్రచార కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి కారకుడైన సీఎం కేసీఆర్‌పై ఆదాయానికి మించిన ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో కేసు దాఖలు చేయాలని, కేసులకు అయ్యే ఖర్చును తాను సమకూరుస్తానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బట్టబయలు అవుతుందనే క్లౌడ్‌ బరస్ట్‌ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కూతురి పెళ్లికి రూ.2 కోట్లు సమర్పించారనే కారణంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించకుండానే రూ.20 కోట్ల నష్టం వచ్చిందని కంపెనీకి వకాల్తా పుచ్చుకుంటూ ఐఏఎస్‌ అధికారి రజత్‌కుమార్‌ ప్రకటన చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరుపకపోతే... ఆ అవినీతిలో బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని, ఈ మొత్తం అవినీతికి కారణమైన కాంట్రాక్టర్‌ను అరెస్ట్‌ చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నైనాల గోవర్ధన్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆర్థిక వినాశనానికి కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం పంపులు మునిగితే రూ.లక్ష కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు మునిగినట్లుగా పరిగణనలోకి తీసుకోవద్దని, మునిగిన పంపుల వ్యయం రూ.4వేల కోట్లే ఉంటుందని రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం నేత శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ముంపునకు ప్రకృతి వైపరీత్యంతోపాటు మానవ తప్పిదం కూడా కారణమేనని అన్నారు. పర్యావరణవేత్త వీవీ సుబ్బారావు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ప్రదేశంలోనే లోపం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నాయకురాలు ఇందిరా శోభన్‌ డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం పంపుల మునకకు మానవ తప్పిదమే కారణమని రిటైర్డ్‌ ఇంజనీర్‌ రంగారెడ్డి అన్నారు. 

Updated Date - 2022-07-23T10:30:12+05:30 IST