కేసీఆర్‌ స్వయంకృతం

ABN , First Publish Date - 2022-08-08T10:59:12+05:30 IST

మునుగోడులో జరగబోయేది ధర్మయుద్ధమని, సీఎం కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ స్వయంకృతం

గోవు లాంటి కాంగ్రెస్‌ను చంపడంతో పులిలాంటి బీజేపీ వచ్చింది

ఇప్పుడా పులి కేసీఆర్‌ను మింగబోతోంది

మునుగోడులో జరగనున్నది ధర్మయుద్ధం

కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పోరు

ఈ ఉప ఎన్నికతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభమవుతుంది

నియోజకవర్గ ప్రజల బాగు కోసమే పదవిని త్యాగం చేశా

అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతోనే కాంగ్రెస్‌కు దుస్థితి

రేవంత్‌ దొంగతనం నుంచి బ్లాక్‌మెయిలర్‌గా ఎదిగాడు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సునామీ రావడం ఖాయం

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు రాజీనామా


మీకు, కేసీఆర్‌కు పొసగదనే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదు కదా?

కేసీఆర్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు స్వయంగా రూ.కోట్లు ఇచ్చాను. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థికసాయం చేశాను. తెలంగాణవాదం బతకాలని ఆయనను గెలిపించాం. కానీ, ఇప్పుడు ఆయన వైఖరి వల్ల వ్యతిరేకించాల్సివస్తోంది. ఈ ఉప ఎన్నికతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభమవుతుంది.


హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో జరగబోయేది ధర్మయుద్ధమని, సీఎం కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో గోవులాంటి కాంగ్రె్‌సను చంపి కేసీఆర్‌ చపండంతో పులిలాంటి బీజేపీ అడుగు పెట్టిందని, ఇప్పుడు ఆ పులి కేసీఆర్‌నే మింగబోతోందని చెప్పారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సునామీ రావడం ఖాయమని, అందులో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ కొట్టుకుపోతారని అన్నారు. ఆదివారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో రాజగోపాల్‌రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు..


ఫైనల్‌గా సస్పెన్స్‌కు తెరదించారన్నమాట!

సస్పెన్సేమీ లేదు. అందరికీ తెలుసు. కానీ, రాజీనామా చేస్తానని చెప్పలేదు. 


బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు కదా?

కాంగ్రెస్‌ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయాక కొన్నాళ్లు వేచిచూశాను. అధిష్ఠానం పరిస్థితిని చక్కదిద్దుతుందేమోనన చూశాను. కానీ, వారు ఏమీ చేయలేదు. తెలంగాణను వదిలేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏమీ చేయలేని పరిస్థితి. నేనేమైనా చేద్దామంటే నాకు ఎటువంటి పదవి లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఉండదని స్టేట్‌మెంట్‌ ఇచ్చాను. అప్పటికే జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడింది. రాహుల్‌గాంధీ కూడా రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో బీజేపీ బలపడుతుందని, ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చెప్పాను. అందుకు కారణం కేసీఆరే. ప్రతిపక్షం లేకుండా చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు.


పశ్చిమ బెంగాల్‌లో అదే జరిగింది కదా?

అవును. తెలంగాణలోనూ గోవులాంటి కాంగ్రె్‌సను కేసీఆర్‌ చంపడం వల్ల పులి లాంటి బీజేపీ అడుగుపెట్టింది. ఆ పులి ఇప్పుడు కేసీఆర్‌ను మింగేస్తుంది. రాష్ట్రంలో ప్రతిపక్షం, ప్రజాస్వామ్యం అన్నవి లేకుండా కేసీఆర్‌ చేశారు. దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయకపోగా.. దళితుడే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఓర్వలేక ఎమ్మెల్యేలను తీసుకున్నారు. 


బీజేపీ కండువాతో రాజగోపాల్‌రెడ్డి ఎలా ఉంటారో?

జైపాల్‌రెడ్డి లాంటివారు జనతాపార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి కేంద్రమంత్రి అయ్యారు. ప్రజల కోసం పార్టీ మారుతున్నాను.. స్వార్థం కోసం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పార్టీ మారుతున్నా. ఎవరేమనుకున్నా మనం నిజాయితీగా ఉంటే భయపడాల్సిన అవసరంలేదు.


రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితిని చూసి ప్రజాస్వామ్యవాదులు బాధపడుతున్నారు కదా?

రాహుల్‌గాంధీ రాజీనామా చేయకుండా పోరాటం చేయాల్సింది. సెక్యులర్‌ సిద్ధాంతమని చెప్పే కాంగ్రెస్‌.. మహారాష్ట్రలో మతతత్వ పార్టీ అయిన శివసేనతో కలిసి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? అంతా కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధం. తెలంగాణ ఇచ్చి కూడా దుస్థితిలో ఉండటానికి అధినాయకత్వం తప్పులే కారణం. చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు.   


కేసీఆర్‌పై తీవ్ర కోపం ఉందా? 

కేసీఆర్‌పై వ్యక్తిగత కోపం లేదు. ఆయన వైఖరిపై, విధానాలపైనే కోపం. కాంగ్రె్‌సలో నాకు సీఎల్పీ నేత పదవి కావాలని అడిగాను. పరిశీలకుడిగా వచ్చిన కేసీ వేణుగోపాల్‌తో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నాకు ఇవ్వాలని చెప్పినా భట్టి విక్రమార్కకు ఇచ్చారు. అంతకుముందు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అడిగాను. పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పాం. అయినా ఇవ్వలేదు.


నల్లగొండ అనగానే కోమటిరెడ్డి బ్రదర్స్‌ గుర్తుకొస్తారు. అయినా అధిష్ఠానం ఇన్నేళ్లుగా ఎందుకు గుర్తించలేదు?

మీలాగే మేమూ ముక్కుసూటిగా మాట్లాడుతాం. వెనక డోర్‌ నుంచి పనులు చేయాలంటే మావల్ల కాదు. ఢిల్లీకి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టేందుకు మేము వ్యతిరేకం. ప్రజలకోసం, కష్టాల్లో ఉన్న కార్యకర్తల కోసం ఖర్చు పెడతాం. ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడైనప్పుడు నేనెందుకు కాకూడదు? ఆయన నాకన్నా ఎక్కువ చదువుకున్నాడా? నాకన్నా విశ్వసనీయత, ఇమేజ్‌ ఉందా? తెలంగాణ కోసం కొట్లాడాడా? సోనియాను, కాంగ్రెస్‌ పార్టీని దూషించిన వ్యక్తి. 


రేవంత్‌తో ఎందుకు పడదు?

ఆయన నాకు మంచి మిత్రుడు. రేవంత్‌ను కాంగ్రె్‌సలోకి ఆహ్వానించిందే నేను. ఈ మధ్య అబద్ధాలు చెబుతున్నారు. ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని నేను చెప్పానంటున్నాడు. పీసీసీ అధ్యక్ష పదవిని మా అన్నకు ఇవ్వవద్దని నేను చెప్పానంటున్నాడు. బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేశాక.. అధ్యక్ష పదవి నీకే వస్తుందని రేవంత్‌ చెప్పాడు. కానీ, ఆలస్యం చేశారు. 


చాలా మంది కాంగ్రెస్‌ నేతలు పార్టీకి ద్రోహం చేయలేదా? 

స్థానికంగా కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది. టీఆర్‌ఎస్‌ వేధింపుల వల్ల, అభివృద్ధికి నిధులివ్వక, కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రె్‌సలో నాయకత్వ లేమి ఏర్పడింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏడేళ్లుగా కొనసాగిస్తారా? ఉత్తమ్‌కు, భట్టికి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన చరిత్ర లేదు. మేం పోరాడిన వాళ్లం. కానీ, క్షేత్రస్థాయిలో పోరాడే, విశ్వసనీయత ఉండే నేతలకు కాంగ్రెస్‌ పార్టీ ఎందుకో అవకాశాలు ఇవ్వడంలేదు. కేసీఆర్‌ విశ్వసనీయత ఉన్న వ్యక్తి కాదు. సెంటిమెంట్‌ను వాడుకొని, ఎప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టి, వాళ్ల ఆలోచనను తప్పుదోవ పట్టించి అధికారాన్ని నిలుపుకొనే పనులు మాత్రమే చేస్తారు.


దేశ రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి కదా! ఒకప్పుడు కాంగ్రెస్‌ చేసిన పనులే ఇప్పుడు బీజేపీ చేస్తోంది.

బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఆ తరువాత కాంగ్రె్‌సతో కలవడం తప్పు.  బీజేపీ సరైన గుణపాఠం చెప్పింది. బీజేపీలో ఎవరూ పార్టీని కుటుంబ ఆస్తిలాగా భావించడంలేదు. మోదీ, అమిత్‌ షా తరువాత వారి వారసులు వస్తారని చెప్పడంలేదు. కానీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలో వారి వారసులే తదుపరి నాయకులుగా చెప్పుకొంటున్నారు. 


మీ అన్నదమ్ముల గురించి కూడా అలాగే అంటున్నారు కదా?

నేనెప్పుడైనా నా కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడని చెప్పానా? ప్రజాస్వామ్యంలో కేసీఆర్‌ తరువాత సీఎం ఈటల రాజేందర్‌ కావాలి. కానీ, కేటీఆర్‌ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చింది? ఈటలకు మంత్రిగా మంచి పేరొచ్చినా కేసీఆర్‌ ఎందుకు ఓర్వలేకపోయారు? అవమానపరిచి పార్టీ నుంచి వెళ్లగొట్టారు. 


బీజేపీ ఒక భిన్నమైన పార్టీ.. ఎలా అడ్జస్ట్‌ అవుతారు?

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న నా ఆశయం కోసం అందరితోనూ కలిసి పనిేస్తా. మూడున్నరేళ్లుగా కేసీఆర్‌ నన్ను అవమానిస్తున్నారు. 


కాంగ్రెస్‌, బీజేపీల్లో ఎవరికి ఓటేసినా.. టీఆర్‌ఎ్‌సకు వేసినట్లే అవుతుంది కదా?

కాంగ్రెస్‌ పార్టీకి నియంత పాలనను అంతమొందించే శక్తి ఉంటే నేనెందుకు పార్టీ మారేవాణ్ని? ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు. కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం. భవిష్యత్తు తెలంగాణలో రాచరిక వ్యవస్థ ఉండకూడదు.. ప్రజాస్వామ్యం కావాలనేలా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వాలి.  ప్రాజెక్టులను అనవసరంగా రీడిజైన్‌ చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఎత్తిపోతల పథకాల పేరిట రూ.లక్ష కోట్లు వృధా చేశారు. మేడిగడ్డ ఎత్తిపోతలను తిప్పిపోతలుగా మార్చారు. సీఎం ఫామ్‌ ల్యాండ్‌ కోసం ప్రజల సొమ్ముతో ఏకంగా రిజర్వాయర్‌నే నిర్మించుకున్నారు. ఆయనేమైనా రాజునా? ఇదేమైనా రాజరిక వ్యవస్థా?


స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చారా? ఆమోదించకపోతే ఎలా?

8న స్పీకర్‌కు సమర్పిస్తాను. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. మూడేళ్లు ఆలోచించి బీజేపీ వల్లే తెలంగాణను కాపాడగలదని నిర్ణయానికి వచ్చాను. ఇదే అంశంపై పలుమార్లు ప్రకటనలు చేశాను. ఈ విషయంలో నన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా అవమానించినా భరించాను.. భరిస్తాను. కానీ, తెలంగాణలో కుటుంబపాలన అంతం కావాలంటే మోదీ, అమిత్‌షా వల్లే అవుతుంది.


కేసీఆర్‌పై మీరు కేసులు పెడతామంటున్నారు కదా?

కేసులు పెడితే జైలుకు పోతారు.. ఏడాదికో, రెండేళ్లకో బయటికి వస్తారు. ఈ దేశంలో హత్య చేసినవాడు కూడా 90 రోజుల్లో బయటికి వస్తున్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా? ‘మా’ కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారు.


మీ అంతరాత్మ కాంగ్రె్‌సతోనే ఉన్నట్లుంది?

కాంగ్రెస్‌ కార్యకర్తలు నేను బయటికి పోతున్నందుకు బాధపడుతున్నారు. పార్టీలో నాకు అవమానం జరిగిందని, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి కింద పనిచేయలేక బయటికి వెళుతున్నానని ఆవేదన చెందుతున్నారు. పీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్‌రెడ్డితో మాట్లాడాను. కలిసి పని చేద్దామనుకున్నాను. మా అన్న (వెంకట్‌రెడ్డి)ను కూడా సముదాయిస్తానని చెప్పాను. కమిటీలు మంచి వ్యక్తులతో వేసి పార్టీని పటిష్టంగా తయారు చేద్దామని సూచించాను. కానీ, డిపాజిట్లు కూడా రాని వ్యక్తులను కమిటీలకు చైర్మన్లను చేశారు. ఆరుసార్లు ఓడిన షబ్బీర్‌ అలీ చైర్మన్‌గా ఉన్న కమిటీలో నన్ను ఒక సభ్యుడిని చేర్చారు. పొమ్మనలేక పొగ పెట్టినట్టు కాదా? చిన్నరాష్ట్రంలో కష్టపడితే 60 సీట్లు సాధించుకొని కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకురావచ్చనుకున్నాను. 


మిమ్మల్ని బీజేపీ వారు పిలిచారా? మధ్యవర్తులా?

అమిత్‌షాను అపాయింట్‌మెంట్‌ కూడా అడగలేదు. ఆయన, ప్రధాని మోదీ కలిసి రాష్ట్రంలో నిజాయితీ కలిగిన, బలమైనే పది మంది వ్యక్తులను ఎంపిక చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. అందులో భాగంగానే నన్ను పిలిచారు.  


ఉప ఎన్నికలో ఒకవేళ ఓడితే పరిస్థితేంటి?

మునుగోడు ప్రజల తీర్పు నాకోసం కాదు. వారి భవిష్యత్తు కోసం. 33 ఏళ్లుగా కాంగ్రెస్‌ కోసం పనిచేసినవాణ్ని. ఎన్నోసార్లు టీఆర్‌ఎ్‌సలోకి రమ్మన్నా వెళ్లలేదు. 


కేసీఆర్‌ వ్యతిరేక, అనుకూల పోరుగా మారుస్తున్నారా?

మునుగోడు ప్రజలకు, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య పోరాటంలో రేవంత్‌రెడ్డి ఉండడు, కాంగ్రెస్‌ ఉండదు. మునుగోడు ఉప ఎన్నిక, ధర్మాన్ని గెలిపించి కేసీఆర్‌ను ఓడించడం చారిత్రక అవసరం. కేసీఆర్‌ ఒకప్పుడు మంచివారు. ఇప్పుడు మారిపోయారు. తనకు తాను రాజుగా భావిస్తున్నారు. 


కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక జీవన్మరణ సమస్య అయ్యేలా బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌ వేసిందా?

బీజేపీ మాస్టర్‌ప్లాన్‌ కాదు. అమరుల ఆత్మఘోష నా రూపంలో బదులు తీర్చుకొమ్మంటోంది. మునుగోడు ఉప ఎన్నిక ఒక తుపాను. అసెంబ్లీ ఎన్నికల నాటికి పెద్ద సునామీ వస్తుంది. అందులో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ కొట్టుకుపోతారు. 


బీజేపీ వాళ్లు మీకు కాంట్రాక్టులిచ్చారని రేవంత్‌ అంటున్నారు?

రేవంత్‌రెడ్డి దొంగతనం నుంచి మొదలుపెట్టి బ్లాక్‌మెయిలర్‌గా ఎదిగి నేడు సీఎం అభ్యర్థి అయ్యారు. నేను రైతు బిడ్డగా కష్టపడి పనిచేసి, ఓ సంస్థను ఏర్పాటుచేసి వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాను. వందల కోట్ల పన్నులు కట్టాను. రాజకీయాల్లోకి వచ్చి పోరాటం చేసి తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్నాను. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి సంస్కారంలేని మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కానీ, రేవంత్‌రెడ్డి అమ్ముతాడు.. తాకట్టు పెడతాడు. వ్యాపారాలు చేస్తే తప్పేముంది? మాకు ఎవరూ ఏ కాంట్రాక్టూ ఇవ్వలేదు. గ్లోబల్‌ టెండర్లలో పాల్గొని కాంట్రాక్టులు పొందుతున్నాం. నా కుమారుడు వాటిని నిర్వహిస్తున్నాడు. 


బీజేపీకి ప్రభుత్వం వస్తే సీఎం పదవికి పోటీ పడరా? 

కొత్తగా వచ్చినవారికి సీఎం పదవి ఇస్తారా? పార్టీ సిద్ధాంతాల కోసం పని చేయడం వరకే నా బాధ్యత. 


ఒకవేళ ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి మీకు ఇస్తానంటే?

బీజేపీకి ఇప్పటికే ఒక ఊపు మొదలైంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఎన్నికలు, ప్రధాని మోదీపై, కేంద్రంపై కేసీఆర్‌ మాటల తరువాత వాళ్లు సీరియ్‌సగా తీసుకున్నారు. ప్రజల ఆలోచన కూడా మారింది. కాంగ్రె్‌సను గెలిపించినా ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని, ఆ పార్టీకి ఓటేసినా టీఆర్‌ఎ్‌సకు వేసినా ఒకటేననే అభిప్రాయం ఏర్పడింది. కేసీఆర్‌ కుటుంబపాలనను దించాలన్నా, టీఆర్‌ఎ్‌సను ఓడించాలన్నా బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారు. మోదీ, అమిత్‌షా తలచుకుంటే సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు సీల్పీనేత పదవి ఇస్తానన్నా చేయగలిగేదేమీలేదు. అక్కడ ఉన్నది ఆరుగురు ఎమ్మెల్యేలే. 


బీజేపీ షార్ట్‌ లిస్టులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఉంటారా?

నాకు తెలియదు. అన్నదమ్ములుగా బాగా కలిసి ఉంటాం. మేం ఐదుగురు అన్నదమ్ములం అలాగే ఉంటాం. నా బలం, బలహీనత రెండూ నా కుటుంబమే. ఇన్నాళ్లుగా బీజేపీలో చేరాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడానికి కారణం కూడా మా అన్న భవిష్యత్తుకు ఇబ్బందులు వస్తాయనే. వెంకట్‌రెడ్డికి ఒక చరిత్ర ఉంది. ప్రజల కోసం, కార్యకర్తల కోసం కష్టపడే వ్యక్తి. చాలా మందికి సొంత ఇమేజ్‌ లేదు. పార్టీ గాలివీస్తే గెలుస్తారు. లేదంటే కొట్టుకుపోతారు. మేము పార్టీ జెండాను కాపాడేవాళ్లం. కార్యకర్తలకు అండగా ఉండేవాళ్లం.  కార్యకర్తలు మమ్మల్ని పేర్లతో కాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్‌గా అభిమానిస్తారు.

Updated Date - 2022-08-08T10:59:12+05:30 IST