మన కాలం భగీరథుడు

ABN , First Publish Date - 2020-06-02T06:03:14+05:30 IST

నీరు పల్లమెరుగును అని విన్నాం.. పైకి కూడా ఎగురును అని ఎన్నడైనా ఊహించామా? తెలంగాణలో ఏదైనా సాధ్యమే అని అసాధ్యాన్ని సుసా ధ్యం చేస్తూ.. భవిష్యత్ ప్రణాళికను ముందే గాడిలో పెట్టే పాలనాదక్షుడు కేసీఆర్...

మన కాలం భగీరథుడు

నీరు పల్లమెరుగును అని విన్నాం.. పైకి కూడా ఎగురును అని ఎన్నడైనా ఊహించామా? తెలంగాణలో ఏదైనా సాధ్యమే అని అసాధ్యాన్ని సుసా ధ్యం చేస్తూ.. భవిష్యత్ ప్రణాళికను ముందే గాడిలో పెట్టే పాలనాదక్షుడు కేసీఆర్.


తిండిలేక అలమటించిన తెలంగాణ ఇప్పుడు దేశానికి తిండే పెట్టే స్థాయికి ఎదిగింది. నెర్రెలు వారి.. నోళ్లు తెరిచిన చెరువులు ఇప్పుడు రోహిణి కార్తెలోనూ మత్తళ్లు దుంకుతున్నాయి. దుక్కి దున్నె సమయానికి కమ్మేసిన కారు మబ్బులవైపు చూసే రైతన్నకు ఇప్పుడు వర్షంతో పనే లేకుండా పోయింది. ‘‘తలాపున పారుతుంది గోదారి.. మన చేనూ మన చెలక ఏడారి’’ అన్న పాటలు విని మూడేళ్లు దాటుతోంది. విషాద పాటల నుంచి పసిడి, ధాన్యపు రాశుల వైపు తెలంగాణ పరుగులు పెడుతోంది. నీరు పల్లమెరుగును అని విన్నాం.. పైకి కూడా ఎగురును అని ఎన్నడైనా ఊహించామా? తెలంగాణలో ఏదైనా సాధ్యమే అని అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. భవిష్యత్ ప్రణాళికను ముందే గాడిలో పెట్టే పాలనాదక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా.. ఇవన్నీ ఎందుకు సాధ్యం కావు.

కేసిఆర్ గారి నోటి వెంట ఏదీ సామాన్యంగా రాదు. వచ్చిందంటే అది జరిగి తీరాల్సిందే. ఎందుకంటే నోటి వెంట వచ్చే మాటకు ముందే కార్యచరణ అంతా పూర్తి చేస్తారు. జస్ట్ ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తే చాలు.. అలా కేసీఆర్ నోటి వెంట నుంచి వచ్చిన వన్నీ జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పుడు నియంత్రిత వ్యవసాయ విధానం కూడా అద్భుతంగా జరగబోతోంది. ఇందాకే చెప్పుకున్నట్లు విషాద పా టలు కాదు.. ఇక నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ అనే పాటలు కొత్త రూపు తెచ్చుకోబోతున్నాయి. ప్రయోగాలు కేసీఆర్‌కు కొత్త కాదు. చేసిన ప్రయోగాలను వందశాతం విజయవంతం చేయడం ఆయన వెన్నతో పెట్టిన విద్య. కోటి ఎకరాల మాగాణి తెలంగాణ కళ్ల ముందు కనపడుతోంది. రబీకి ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కళ్లముందు కనిపించాయి. ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి ఆర్థిక బరోసా కల్పించాలి. పంటలకు అనువైన సారవంతమైన భూ ములు ఉండటం తెలంగాణ గొప్పదనం. అందుకే ఆ భూముల్లో సిరులు కురిపించి రైతు ఇంట లక్ష్మి దేవీని కూర్చోబెట్టడమే కేసీఆర్ కొత్త ఆలోచన. ఒక్కో జిల్లా ఒక్కో రకమైన పంటలకు అనువుగా ఉంటుంది. సమైక్య పాలనలో అసలు నీళ్లే లేవు. అలాంటిది పంటల పట్ల ఇంతటి శ్రద్ధ ఇంకెక్కడ ఉంటుంది. అందుకే తొలి రెండున్నరేళ్లు వరి ధాన్యాన్ని పండించిన రైతన్న ఇప్పుడు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా కార్యాచరణ మొదలైంది.




ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి వేలాది గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాయి. నియంత్రిత వ్యవసాయ విధానానికి జై కొడుతున్నాయి. కేసీఆర్ వెంటే నడుస్తామని, చెప్పిన పంటే వేస్తామని పల్లెలన్నీ ప్రతిన బూనుతున్నాయి. కేసీఆర్ తన ఆలోచన విధానం మాత్రమే చెప్పారు. దానిలోని మంచి చెడులను చెప్పలేదు. అయినా.. కేసీఆర్ వెంటే నడుస్తామని తెలంగాణ ప్రజ తీర్మానం చేయడం అంటే నాయకుడి మీద జనం పెట్టుకున్న నమ్మకం అలాంటిది. ఇప్పటికే ప్రజా ప్రతినిధులంతా పల్లెల బాట పట్టారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యవసాయ అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. క్లస్టర్ల వారీగా సాగు పద్ధతులను వివరిస్తున్నారు. వానాకాలం పంటకు రైతాంగం అన్ని రకాలుగా సిద్ధం అయ్యింది. ఇటీవల కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్తా అన్నారు. ఇప్పుడు ఆయన నిర్ణయంపై రైతుల కంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికే సగం ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఉన్నా ఆ కొద్దిపాటి అరకొర నాయకులు కూడా ఆ శుభవార్తలు వింటే మూర్చపోవడం ఖాయం.

మరోవైపు నియంత్రిత వ్యవసాయ విధానంపై ప్రతిపక్ష నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వాళ్లకు అలా మాట్లాడకపోతే భవిష్యత్ ఉండదు.  పేరు చెప్పినందుకే అంత రాద్ధాంతం చేస్తే.. ఇక విధివిధానాలపై స్పష్టత ఇచ్చాక ఇంకెంత రాద్ధాంతం చేస్తారో. మద్దతు ధరను ప్రకటించకుండా.. చెప్పిన పంటను ఎలా వేస్తారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకేలా మాట్లాడుతున్నారు. బియ్యపు గింజ పరిమాణం చెప్పగలిగిన ముఖ్యమంత్రికి రైతుకు ఏం చేయాలో మీరు చెప్పాలా? అందుకే గత ప్రభుత్వాల హయాంలో పెండింగులు తప్ప పూర్తి అన్న పదం ఎరుగని ప్రజలకు ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి కేసీఆర్ నీళ్లు ఇస్తున్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారు. రైతుబంధు, రైతు భీమా, సకాలంలో ఎరువులు అందిస్తున్నారు. నారు పోసి, నీరు ఇస్తున్న కేసీఆర్‌కు రైతుకు ఏం కావాలో అన్నీ తెలుసు. అందుకే ప్రతిపక్షాలు అనుచిత వ్యాఖ్యలు, ఉచిత సలహాలు మానితే బాగుంటుంది.

అందుకే మా మంత్రి కేటీఆర్ చెప్పినట్లు కేసీఆర్ అంటే.. కే–కాల్వలు, సీ–చెరువులు, ఆర్–అంటే రిజర్వాయర్లు.. కళ్లముందు కనపడుతున్న వీటికి కూడా ప్రతి పక్షాలు వక్రభాష్యంచెప్తే ఏమనాలి. ఇక చివరగా కాలం ఎవ్వరి కోసం ఆగదు. కాలం వెంట పరిగెడుతూ ఫలితాలను రాబట్టుకోవడమే నిజమైన వీరుడి కర్తవ్యం, లక్షణం. తను మాత్రమే కాకుండా ఇతరులను కూడా తన వెంట ఫలితాల కోసం పరిగెత్తేలా చేయడం పాలకుడి లక్షణం. అది అత్యంత కఠినమైనది, కష్టమైనది కూడా. అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. రాబోయే రోజుల్లో కాలానికి మరింత వేగంగా తెలంగాణ పరిగెత్తబోతోంది. అందులో ప్రజలకు ఎలాంటి సందేహం లేదు. ఉన్నదల్లా ప్రతిపక్షాలకు మాత్రమే.        

శ్రీనివాస్ గౌడ్

(రాష్ట్ర పర్యాటక, ఆబ్కారీ, క్రీడా సాంస్కృతిక శాఖా మంత్రి)

Updated Date - 2020-06-02T06:03:14+05:30 IST