మునిగిపోతామని కేసీఆర్‌కు భయం

ABN , First Publish Date - 2022-08-11T08:16:02+05:30 IST

‘‘రాష్ట్రంలో పూర్తి కాలం అధికారంలో ఉండాలని కోరుకునే మనస్తత్వం కేసీఆర్‌ది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే మునిగిపోతామన్న భయం ఆయనకు పట్టుకుంది.

మునిగిపోతామని కేసీఆర్‌కు భయం

మత్తులో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఆయన.. బీజేపీలో చేరేది 12 మందే కాదు.. ఆ ఎమ్మెల్యేల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

యాదాద్రి, చిట్యాల రూరల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో పూర్తి కాలం అధికారంలో ఉండాలని కోరుకునే మనస్తత్వం కేసీఆర్‌ది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే మునిగిపోతామన్న భయం ఆయనకు పట్టుకుంది. కేసీఆర్‌ బొమ్మతో ఎన్నికలకు వెళ్తే మునగడం ఖాయమన్న భయం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లోనూ ఉంది. టీఆర్‌ఎస్‌ ఏక్‌ నిరంజన్‌ పార్టీ.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలతో ఆ పార్టీ అధినేతకు పనిలేదు. ఎప్పుడు ఎన్నికలకు వెళ్తాడో.. ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ముందస్తు ఎన్నికలైనా, మరే విషయమైనా మత్తులో అప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తి ఆయన’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎనిమిదో రోజైన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకిలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నేతలు బీజేపీవైపు చూస్తున్నారని తెలిపారు. ఇటీవల టీఆర్‌ఎ్‌సకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని తాను వ్యాఖ్యానించానని, ఆ సంఖ్య మరింత రెట్టింపయ్యే అవకాశం ఉందని చెప్పారు.   రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని తాపత్రయపడుతున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని అన్ని కంపెనీల వద్ద పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేదని  తెలిపారు. అయితే ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు ఎందుకు పోటీ చేయడంలేదని, దమ్ముంటే మునుగోడులో ఇప్పుడు పోటీ చేయాలన్నారు. రాష్ట్రంలో అమ్ముడుపోయేవి కమ్యూనిస్టులు, మజ్లి్‌సలేనని, ఆ రెండు పార్టీల నాయకులు కేసీఆర్‌కు కోవర్టుల్లాగా మారారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనున్నారని వెల్లడించారు. 


కేసీఆర్‌ అహంకారమంతా దిగాలి

తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లయినా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండలేదని, ఎలాంటి మార్పు రాలేదని సంజయ్‌ అన్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి, సుంకెనపల్లి గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. సుంకెనపల్లిలో కల్లుగీత కార్మికుడిని పలకరించారు. ఆ తర్వాత కల్లు తాగారు. ఈ సందర్భంగా, యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకిలో జరిగిన సభలోనూ సంజయ్‌ మాట్లాడారు. రైతుబంధు పేరిట పెద్దోళ్లకే పెద్ద ఎత్తున డబ్బులు అందుతున్నాయని ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్‌ అహంకారం కొద్దిగా తగ్గిందని, మునుగోడు ఉప ఎన్నికతో మొత్తం తగ్గుతుందని చెప్పారు.  


కరెంటు, ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారు?

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏం యుద్ధం జరిగిందని కరెంటు చార్జీలు, బస్‌ చార్జీలు పెంచారని బండి సంజయ్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం ధర తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం పన్ను భారం తగ్గించలేదని ఒక ప్రకటనలో ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగాయని, దీంతో నెలకు 30 రూపాయలు మాత్రమే ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు.  


ఆ ప్రచారం అవాస్తవం: ఈటల

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రానున్న ఎన్నికల్లో తాను బీజేపీ తరఫున సీఎం అభ్యర్థినంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు. సరైన సమయంలో ప్రజామోద నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Updated Date - 2022-08-11T08:16:02+05:30 IST