కేసీఆర్‌ ఓ డిక్టేటర్‌

ABN , First Publish Date - 2022-07-03T09:07:12+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.

కేసీఆర్‌ ఓ డిక్టేటర్‌

  • ప్రధాని మోదీని స్వాగతం పలుకకుండా
  • వ్యక్తిని కాదు, వ్యవస్థను అవమానించారు
  • రాజకీయ మర్యాదకు తూట్లు పొడిచారు
  • కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయమంటే సర్కస్‌
  • బీజేపీ శ్రేణులకు మాత్రం సమాజసేవ 
  • కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు


హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రికి ఆహ్వానం పలకకుండా రాజ్యాంగం, రాజకీయ మర్యాదలకు తూట్లు పొడిచారన్నారు. ప్రోటోకాల్‌ పాటించని కేసీఆర్‌.. అవమానించింది ఓ వ్యక్తిని కాదని ఓ వ్యవస్థనని విమర్శించారు. నోవాటెల్‌ హోటల్‌ వద్ద శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతలను ప్రధాని మోదీ ఎప్పుడూ గౌరవిస్తారని, కానీ తెలంగాణ సీఎం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీశారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌ ఓ డిక్టేటర్‌ అని ఆరోపించారు. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను రెండ్రోజుల సర్కస్‌ అని పేర్కొన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు. కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయమంటే ఓ సర్కస్‌ అని, తమకు మాత్రం సమాజసేవకు మాధ్యమమని బదులిచ్చారు. అంతేకాక తెలంగాణ ఈ రోజు అమలు చేస్తున్న పథకాలను దేశం రేపు అమలు చేస్తుందంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా స్మృతి స్పందించారు. తెలంగాణలో ప్రస్తుతం వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని, దేశం ఆ మోడల్‌ను అంగీకరించబోదని కౌంటరిచ్చారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ సమావేశాల నిర్వహణ కేసీఆర్‌కు రాజకీయంలా కనిపిస్తోందని విమర్శించారు. 

Updated Date - 2022-07-03T09:07:12+05:30 IST