ఒక్క హామీనీ కేసీఆర్‌ నెరవేర్చలేదు

ABN , First Publish Date - 2022-09-28T05:11:54+05:30 IST

ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్‌ నెరవేర్చలేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

ఒక్క హామీనీ కేసీఆర్‌ నెరవేర్చలేదు
అండూరులో షర్మిలకు స్వాగతం పలుకుతున్న ప్రజలు

  నన్ను ఎమ్మెల్యేలు బెదిరిస్తారా? 

 రాజశేఖరరెడ్డి బిడ్డను.. ఎవరికీ భయపడను

 జిన్నారంలో పాదయాత్రలో వైఎస్‌ షర్మిల 


జిన్నారం, సెప్టెంబరు 27: ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్‌ నెరవేర్చలేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం జిన్నారం మండలం అండూరు, ఇజాజిగూడెం, సోలక్‌పల్లి, ఊట్ల గ్రామాల మీదుగా సాగింది. అండూరు, సోలక్‌పల్లి, ఊట్లలో స్థానిక మహిళలు, రైతులో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిన్నారంలో నిర్వహించిన సభలో ఆమె మట్లాడుతూ పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. సీఏం కేసీఆర్‌ హామీలను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. దళితబంధు ఎమ్మెల్యేల అనుచరులకే ఇస్తున్నారని, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందడం లేదని, మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపటానికే గిరిజన రిజర్వేషన్ల ప్రకటన చేశారని ఆరోపించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే విలేకరులపై దాడిచేస్తానని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు చాలెంజ్‌ చేస్తున్నారని, పాలమూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే  భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను వైఎస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డనని, ఎవరికీ భయపడనని, మీకు చేతనయ్యింది చేసుకోండని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల సమస్యలపై మంత్రి కేటీఆర్‌ ఆలస్యంగా స్పందించడంపై ఆమె మండిపడ్డారు. అనంతరం పాదయాత్ర మెదక్‌జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.


 

Updated Date - 2022-09-28T05:11:54+05:30 IST