రాష్ట్రానికి కేసీఆర్‌ దరిద్రంగా మారారు!

ABN , First Publish Date - 2022-05-29T09:41:48+05:30 IST

తెలంగాణాలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పంజాబ్‌లో రైతులకు సీఎం కేసీఆర్‌ పరిహారం ఇస్తున్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

రాష్ట్రానికి కేసీఆర్‌ దరిద్రంగా మారారు!

  • తెలంగాణను దోచుకొని రూ.4లక్షల కోట్ల అప్పు చేశారు
  • ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే పంజాబ్‌లో పరిహారమా? 
  • ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన బండిపై చర్యలేవి?: షర్మిల


సత్తుపల్లి, మే 28: తెలంగాణాలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పంజాబ్‌లో రైతులకు సీఎం కేసీఆర్‌ పరిహారం ఇస్తున్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్‌ దరిద్రంగా మారారని వ్యాఖ్యాంచారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఆయన దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామం నుంచి శనివారం ఆమె తన ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్‌ మోసం చేయనివర్గమంటూ లేదని, ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను దగా చేశారని ధ్వజమెత్తారు. ఉద్యమకారుడని నమ్మి కేసీఆర్‌కు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని దోచుకొని రూ.4లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.


 కేసీఆర్‌ అవినీతి చిట్టా తమవద్ద ఉందని చెబుతున్న కేంద్రం ఆయనపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ముస్లిం, మైనారిటీ రిజర్వేషన్లను రద్దుచేస్తామన్న బండి సంజయ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆ రిజర్వేషన్లను రద్దు చేయడం ప్రధాని మోదీ వల్ల కూడా కాదన్నారు. ఇటీవల బండి సంజయ్‌ ముస్లిం, మైనారిటీ రిజర్వేషన్లు, మసీదులపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం చర్యలు తీసుకోకపోగా ప్రధాని మోదీ కూడా సమర్థించడం దారుణమన్నారు. మసీదులను కూల్చి శవాలు ఉంటే ముస్లింలవని, శివలింగాలు ఉంటే హిందువులని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి అధికారం ఉండాలంటూ ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. 77వ రోజు యాత్రలో భాగంగా షర్మిల తన పాదయాత్రను  తాళ్లమడలో ప్రారంభించి సత్తుపల్లి మీదుగా సిద్ధారం వరకు కొనసాగించారు. రాత్రి అక్కడే రాత్రి బస చేశారు. షర్మిల పాదయాత్ర 78వరోజు ఆదివారం సిద్దారం వద్దే ప్రారంభం అవుతుంది. మర్లపాడులో రాత్రి బస చేస్తారు. 


డబ్బులున్నోళ్లకే రాజ్యసభ పదవులా? 

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌.. డబ్బులున్నోళ్లకే రాజ్యసభ పదవులు ఇచ్చారంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడమే ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌ బ్యాంకు ఖాతాలో రూ.860కోట్లు ఉంటే.. ఇక ఆ పార్టీ నేతల ఖాతాల్లో ఇంకెన్ని సొమ్ములు ఉండి ఉంటాయో ప్రజలు ఆలోచించాలన్నారు. పరిపాలనలో నూతన సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నేత ఎన్టీఆర్‌ అని షర్మిల కొనియాడారు. ఎన్టీఆర్‌  జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. 

Updated Date - 2022-05-29T09:41:48+05:30 IST