కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. ఆర్థిక శాఖ ఆమోదం..

ABN , First Publish Date - 2021-12-03T15:02:01+05:30 IST

కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌..

కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. ఆర్థిక శాఖ ఆమోదం..

‘లష్కర్‌’లుగా 3,357 మంది వీఆర్‌ఏలు

పదిలోపు విద్యార్హత ఉన్న ఆ ఉద్యోగులు..

రెవెన్యూ శాఖ నుంచి ఇరిగేషన్‌ శాఖ పరిధిలోకి

రెవెన్యూ శాఖకు ఫైల్‌.. త్వరలోనే ఉత్తర్వులు  

చెరువులు, కుంటలు, కాలువల పర్యవేక్షణ బాధ్యత


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌(వీఆర్‌ఏ)లలో పదో తరగతిలోపు విద్యార్హతలున్న 3,357 మందిని చెరువులపై లష్కర్‌ (మస్కూరీ, నీరడి)లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వీరిని రెవెన్యూ శాఖ నుంచి నీటిపారుదల శాఖలోకి మార్చాలనే ప్రతిపాదనకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో సీసీఎల్‌ఏ అధికారులు జిల్లాల వారీగా పదో తరగతిలోపు విద్యార్హతలున్న వీఆర్‌ఏల జాబితాను బుధవారం సచివాలయానికి చేరవేశారు. రాష్ట్రంలో మొత్తం 10,724 మంది వీఆర్‌ఏలు ఉన్నారని, వీరిలో 3,730 మంది వీఆర్‌ఏలకు 10వ తరగతిలోపు విద్యార్హతలున్నాయని ఆ నివేదికలో వెల్లడించారు.


అయితే నీటిపారుదల శాఖలో 3,357 లష్కర్‌ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉండటంతో అంతమంది వీఆర్‌ఏలనే రెవెన్యూ నుంచి ఇరిగేషన్‌ శాఖకు మార్చనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఫైల్‌ గురువారం రెవెన్యూ శాఖ వద్దకు చేరింది. సదరు ఉద్యోగులను రెవెన్యూ నుంచి నీటిపారుదల శాఖకు బదిలీ చేసేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియపై రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించారని, రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని ఓ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉత్తర్వులు వెలువడుతాయని వెల్లడించారు.


ఔట్‌సోర్సింగ్‌ ప్రతిపాదనలు తిరస్కరణ

తెలంగాణలో చెరువులు, కుంటలు, కాలువల పర్యవేక్షణ కోసం గతంలో లష్కర్‌ పోస్టు ఉండేది. కానీ పదవీ విరమణ పొందిన లష్కర్‌ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం మిషన్‌ కాకతీయతో చెరువులు, కాల్వలను ప్రభుత్వం ఆధునికీకరించింది. ఈ క్రమంలోనే వీటి పర్యవేక్షణకు లష్కర్‌ పోస్టు అనివార్యంగా మారడంతో కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునేందుకు అనుమతి కోరుతూ ఇరిగేషన్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని తోసిపుచ్చిన ప్రభుత్వం.. పదోతరగతి లోపు విద్యార్హతలున్న వీఆర్‌ఏలను లష్కర్‌లుగా నియమించుకోవాలని, అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్‌ను ఆదేశించింది.

Updated Date - 2021-12-03T15:02:01+05:30 IST