గిరిజనులతో కేసీఆర్ స‌ర్కార్ ఆటలాడుతోంది: విజయశాంతి

ABN , First Publish Date - 2022-02-18T03:06:09+05:30 IST

గిరిజనులతో కేసీఆర్ స‌ర్కార్ ఆటలాడుతోంది: విజయశాంతి

గిరిజనులతో కేసీఆర్ స‌ర్కార్ ఆటలాడుతోంది: విజయశాంతి

హైదరాబాద్: అమాయక గిరిజనులతో కేసీఆర్ స‌ర్కార్ ఆటలాడుతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న పోడు భూములను కేసీఆర్ సర్కారు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి ఆరోపించారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, నేటికీ ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వక... గిరిజన రైతులను అయోమయానికి గురి చేస్తూ వారి భూములు కాజేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై విజయశాంతి మండిపడ్డారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..


''అమాయక గిరిజనులతో కేసీఆర్ స‌ర్కార్ ఆటలాడుతోంది. వారు ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అటవీ, పోలీస్ శాఖ‌ అధికారులు గిరిజనుల నుంచి బలవంతంగా భూమిని లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భూమి దక్కదేమోనని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా... కేసీఆర్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికలప్పుడు కేసీఆర్ పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల తర్వాత  పట్టాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. అయితే నేటికీ ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వక... గిరిజన రైతులను అయోమయానికి గురి చేస్తూ వారి భూములు కాజేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరు గిరిజన పోడు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇల్లెందు మండలం ఏడుప్పలగూడెం గ్రామానికి చెందిన కుంజా రామయ్య అనే గిరిజన పోడు రైతు భూమిలో అటవీ అధికారులు జేసీబీలతో ట్రెంచ్‌ పనులు చేపట్టారు. స్థానికుల ప్రతిఘటనతో వెనుదిరిగినప్పటికీ తనకు భూమి దక్కదనే మనోవేదనతో రామయ్య అదే రోజు గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం గుండాల మండలం మామకన్ను ఏరియాలోని కల్తీ గుంపునకు చెందిన కల్తీ కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు సాగు చేస్తున్న భూమిలో అటవీ శాఖ అధికారులు ట్రెంచ్‌ పనులు చేపట్టడంతో తన కుటుంబాన్ని ఆదుకునేవారే లేరంటూ... త‌న పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలో నిజాం పాలన నడుస్తుందనడానికి ఇంతకంటే ఏం రుజువు కావాలి? బంగారు తెలంగాణ అని మాయమాటలు చెబుతూ... అమాయక గిరిజన భూములను గుంజుకోవడం ఎంత వరకు సమంజసం? 2005 నాటికి పోడు సాగులో ఉన్న భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించినందున దరఖాస్తులు స్వీకరించామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 2005కు ముందు సాగులో ఉన్న పోడు భూముల్లో కొన్నింటికీ గతంలోనే పట్టాలిచ్చామని... మిగతా 3 లక్షల దరఖాస్తుల్లో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తామూ ఏం చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఒక్క ఖ‌మ్మం జిల్లాలోనే సాగులో ఉన్న 3,12,884 ఎకరాల పోడు భూములకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు జారీ చేయాలి. జిల్లాలో 88,484 మంది రైతులు దరఖాస్తు చేశారు. ఖమ్మం పరిధిలో 18,603 మంది రైతులు 42,560 ఎకరాల పోడు భూములకు దరఖాస్తు చేశారు. ఒక్క జిల్లాలోనే ఇంత మందికి ఆన్యాయం జరుగుతోంది. ఈ రైతులకు అండగా బీజేపీ పోరాడుతుంది. గిరిజనులందరికీ పోడు భూముల పట్టాలు వచ్చేవరకు ఉద్య‌మం చేసి... కేసీఆర్‌ను గద్దె దించుదాం.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-02-18T03:06:09+05:30 IST