కేసీఆర్‌ ఫ్లెక్సీ తొలగింపు.. పవన్‌ అభిమానుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-02-27T01:49:55+05:30 IST

విజయవాడ కృష్ణలంక ఫీడర్‌ రోడ్డు లో సీఎం కేసీఆర్‌ ఫొటోతో పవన్‌ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని కార్పొరేషన్‌ సిబ్బంది శనివారం తొలగించడంపై

కేసీఆర్‌ ఫ్లెక్సీ తొలగింపు.. పవన్‌ అభిమానుల ఆగ్రహం

విజయవాడ: విజయవాడ కృష్ణలంక ఫీడర్‌ రోడ్డు లో సీఎం కేసీఆర్‌ ఫొటోతో పవన్‌ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని కార్పొరేషన్‌ సిబ్బంది శనివారం తొలగించడంపై పవన్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 21వ డివిజన్‌ నల్లగేటు సమీపంలో గురువారం రాత్రి పవన్‌ అభిమానులు భీమ్లా నాయాక్‌ సినిమా విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఫోటోతో పాటు తెలంగాణా మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌‌ల చిత్రాలతో కూడిన భారీ ఫెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అయితే శనివారం ఉదయం కార్పొరేషన్‌ సిబ్బంది ఈ ఫ్లెక్సీని తొలగించారు. దీనిపై డివిజన్‌ పవన్‌ అభిమానులతో పాటు కృష్ణలంక ఫ్యాన్స్‌ మొత్తం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ సినిమాపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తుందని, సినిమా టిక్కెట్ల విషయంలో, థియేటర్లు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్ర ప్రజలు గమనించారని, రాజకీయంగా ఎదుర్కోలేక సినిమా విడుదలపై అనేక ఆంక్షలు విధించి ప్రభుత్వ పెద్దలు ఆనందం పొందారని అభిమానులు పేర్కొన్నారు.


కానీ తెలంగాణా సీఎం కేసీఆర్‌ మాత్రం సినిమా ఇండస్ట్రీపై వరాలు కురిపించారని, అందుకే అభిమానంతో బ్యానర్‌ ఏర్పాటు చేస్తే తట్టుకోలేని ప్రభుత్వం మరింత దిగజారి ఫ్లెక్సీని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం ఈ డివిజన్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ఒకరు పాల్గొనగా అయన కోసం స్యాగత బ్యానర్స్‌ ఏర్పాటు చేశారని, వాటిని అప్పటి నుంచి ఎందుకు తొలగించలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కేవలం పవన్‌ బ్యానర్‌ తొలగించడానికే ఆ బ్యానర్స్‌ను గురువారం తొలగించారని అధికారులు, ప్రభుత్వ తీరును తమతో పాటు ప్రజలు చూస్తున్నారని, సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం చెబుతారని అన్నారు.

Updated Date - 2022-02-27T01:49:55+05:30 IST