కేసీఆర్‌ రైతు ద్రోహి

ABN , First Publish Date - 2022-04-10T07:48:11+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు ద్రోహి అని, ధాన్యం కొనుగోళ్ల అంశంలో అన్నదాతలను

కేసీఆర్‌ రైతు ద్రోహి

  • రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనాలి
  • యాసంగి ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలి
  • గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు
  • రైతు సదస్సుల్లో బీజేపీ నేతలు


మహబూబ్‌నగర్‌, బోధన్‌ రూరల్‌/ ఎడపల్లి, ఖమ్మం, వేములవాడ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు ద్రోహి అని, ధాన్యం కొనుగోళ్ల అంశంలో అన్నదాతలను మోసం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. రాష్ట్ర గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటాన్ని తప్పుబట్టాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి, ఖమ్మంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రైతు సదస్సులు జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.


ధాన్యం కొనుగోలు చేయకపోతే సీఎం కేసీఆర్‌కు అధికారంలో కొనసాగే నైతికహక్కు లేదని మహబూబ్‌నగర్‌లో జరిగిన సదస్సులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. యాసంగి ధాన్యానికి బోనస్‌ ప్రకటించి, తక్షణమే కొనుగోళ్లు మొదలుపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ పరిరక్షకురాలైన గవర్నర్‌పై మంత్రి కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ సదస్సులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఇక, చేసిన తప్పులు, లక్ష కోట్ల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కుటిల రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు చిప్పకూడు తప్పదని ఎడపల్లిలో జరిగిన సదస్సులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. ఇన్నాళ్లు రాష్ట్రమే ధాన్యం కొనుగోలు చేస్తోందని రైతులను మభ్యపెట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు కేంద్రంపై నిందలు వేయడం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు.


సైనికులను అవమానించి, రైతులను మోసం చేసి సీఎం కేసీఆర్‌ దేశ, రైతుల ద్రోహిగా మారారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు  రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండటం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమన్నారు. బోధన్‌ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని మూసేసి అటు రైతులను ఇటు కార్మికులను మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రావణాసుర జాతికి చెందినదని ఖమ్మంలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతను ఆగం చేసిన కేసీఆర్‌ చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలిపోతారన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు రైతు దీక్షలు చేశారని, కానీ ‘పరిపాలన చేతకాని దీక్ష’ పేరుతో  ప్రగతిభవన్‌ ముందు దీక్షలు చేసి తమ చేతకాని తనాన్ని ఒప్పుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనగోలు చేయకపోతే కేంద్రం ప్రతిగింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుందన్నారు.


బీజేపీ తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల షయంలో రాష్ట్రం తన బాధ్యతను విస్మరించి రైతుల నోట్లో మట్టి కొడుతోందన్నారు. 


Updated Date - 2022-04-10T07:48:11+05:30 IST