కరీంనగర్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు తానే టికెట్ ఇప్పించానని తెలిపారు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి ప్రజలు నవ్వుకుంటున్నారని, పెద్దపల్లికి వస్తా కాసుకో అని ఈటల సవాల్ విసిరారు. కేసీఆర్ బొమ్మతో గెలుస్తామనుకుంటున్నారని, ఇకపై ఆ బొమ్మకు ఓట్లు పడవని జోస్యం చెప్పారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కథ ముగియడం ఖాయమని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.